“సతతం శ్రద్ధతో నిన్ను ఉపాసించే వారిలోను, అక్షరం, అవ్యక్తం అయిన పరబ్రహ్మాన్ని ఉపాసించే వారిలోను యోగిశ్రేష్ఠులు ఎవ్వరు?” అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించాడు.* అందుకు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు:* “ఎవ్వరు నా యందు మనస్సు నిలిపి, నిత్యసమాహితచిత్తులయి, అత్యుత్తమ శ్రద్ధతో నన్ను ఉపాసిస్తూంటారో – వారే నా ఉత్తమోపాసకులు, యోగిశ్రేష్ఠులు. నాశరహితం, అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వవ్యాప్తం, అచింత్యం, అచలం, శాశ్వతం అయిన బ్రహ్మాన్ని ఎవ్వరు ఉపాసిస్తూంటారో, ఉత్తమమైన ఇంద్రియనిగ్రహం అవలంబించి, అన్నిటిలోను సమబుద్ధి కలిగి, సర్వభూతహితం ఆశిస్తారో వారు నన్నే పొందుతున్నారు. కాని అవ్యక్తమైన బ్రహ్మంలో ఆసక్తచిత్తులైనవారి మార్గం కష్టతరం; ఎందుకంటే, దేహాభిమానయుక్తులైనవారికి ఈ పరబ్రహ్మనిష్ఠ ప్రబలాయాసకరం కానిదే సిద్ధించదు. ఎవ్వరు తమ సమస్త కర్మలను నాకు అర్పించి, అనన్యాసక్తచిత్తులై పరిపూర్ణవిశ్వాసంతో నన్ను ధ్యానిస్తూంటారో వారిని జననమరణరూపమైన సంసారసాగరంనుంచి అతిశీఘ్రంగా నేను ఉద్ధరిస్తాను.” ఇక్కడ జ్ఞానయోగ భక్తియోగాలు రెండూ సూచించబడ్డాయి. రెండూ పైన నిర్వచించబడ్డాయి. జ్ఞానయోగం దివ్యమైంది; అంతేగాక జ్ఞానయోగం మహోన్నత వేదాంతమయం; ఇక దాదాపుగా ప్రతి మానవుడు – అదేం చిత్రమోగాని – వేదాంత విహితమైన సమస్తం విధిగా తాను చేయగలనని తలస్తూంటాడు; కాని నిజానికి వేదాంత విహితజీవనం గడపటం చాలకష్టం. వేదాంతానుసారం జీవితాన్ని గడప యత్నిస్తూ తరచు మహాపదలకు గురవుతూంటారు. లోకం రెండు రకాల వ్యక్తులతో కూడుకొని ఉన్నదని చెప్పవచ్చు. శరీర సంరక్షణమే జీవిత పరమావధిగా ఎంచే ఆసురసంపదగలవారు ఒక తరగతివారు, శరీరం కేవల ధర్మసాధనమని ఉత్తమ పురుషార్థాన్ని – ఆత్మజ్ఞానాన్ని – పొందటానికి కేవలం సాధనభూతమని గ్రహించే దైవసంపదగలవారు వేరొక తరగతివారు. తన కృత్యాలు ధర్మసమ్మతమని తెలుపటానికై పరమదుర్మార్గుడు సైతం శాస్త్ర ప్రమాణాలను చూపవచ్చు, నిజానికి చూపుతుంటాడు;* ఈ రీతినే జ్ఞానమార్గం సజ్జనుడి సత్కార్యాలను ఎంత ప్రోత్సహిస్తుందో దుర్జనుడి దురంతాలను అంత సమర్థిస్తూన్నట్లు కనిపిస్తుంది. జ్ఞానయోగంలో వున్న మహాప్రమాదం ఇది. జ్ఞానయోగి మాదిరి భక్తుడు ఒక్కసారిగా అంత పైకి ఎగురనూ ఎగురడు, అందుచేత గుబేలున ఒక్కసారిగా పతనం పొందనూ పొందడు. పారమార్థికుడైన వ్యక్తి ఏ మార్గం అవలంబించినా, నిజానికి హృదయగ్రంథి వీడనిదే ఎన్నటికీ ముక్తుడు కాడు.
పావన చరిత్రురాలైన ఒక గోపిక ఎలా పుణ్యపాప సంబంధ విముక్త అయిందో యీ కింది శ్లోకాలు వెల్లడిస్తాయి:
తచ్చిన్తా విపులాహ్లాదక్షీణపుణ్యచ యా తథా,
తదప్రాప్తిమహద్దుఃఖవిలీనా శేషపాతకా.
చిన్తయన్తీ జగత్సూతిం పరబ్రహ్మస్వరూపిణమ్,
నిరుచ్ఛ్వాసతయా ముక్తిం గతాన్యా గోపకన్యకా.
–విష్ణుపురాణం (5–13–21, 22)
“శ్రీకృష్ణ చింతనవలని విపులాహ్లాదం ఆమె పుణ్యకర్మలను క్షీణింపచేయ, కృష్ణుని పొందలేకపోతిని కదా! అనే మహాదుఃఖం ఆమె సమస్త పాపాలను నశింపచేసింది: అప్పుడు ఆ గోపకన్యక ముక్త అయింది.” మానవ మానసంలోని కామక్రోధాది వికారాలు స్వయంగా తప్పిదాలు కావని గ్రహించటమే భక్తియోగంలోని మూలరహస్యం. అవి మహోత్తమ స్థితి పొందేవరకు వాటిని జాగరూకతతో నిగ్రహిస్తూ సక్రమమార్గంలో ప్రవర్తింప చేయటమే* మన కర్తవ్యం. ఏది మనలను భగవదున్ముఖం చేస్తుందో అదే ఉత్తమమార్గం, మిగిలినవన్నీ అక్రమమార్గాలు, పతనహేతువులు. సుఖదుఃఖాలు సర్వజనసామాన్యాలనీ, తరచు ఎల్లరకు, ఎల్లవేళల కలుగుతూనే వుంటుందనీ మనం ఎరుగుదుం. సిరిసంపదలు లేవనో, మరి ఏ ఐహిక వస్తువు లభించలేదనో ఎవరైనా వేదన పడుతూంటే తన వేదనను అక్రమమార్గంలో ప్రవర్తింప చేస్తూన్నవాడవుతాడు. అయినా వేదనకుకూడ ప్రయోజనం ఉన్నది. పరమార్థాన్ని తెలియనైతినని, భగవంతుణ్ణి కాంచనైతినని ఎవడినైనా వేదన పడనివ్వండి; ఆ వేదన అతడికి మోక్షప్రదమవుతుంది. దోసెడు కాసులు దొరికాయని నువ్వు సంతోషపడితే అది నీ సంతోషానికి అక్రమమార్గం. ఆ సంతోషానికి ఉత్తమమార్గాన్ని చూపాలి. మహోన్నతాదర్శప్రాప్తికి అది వినియోగపడాలి. అలాటి దివ్యాదర్శప్రాప్తిచేత కలిగే ఆనందం అత్యుత్తమం కదా! ఇతర మనోభావాలన్నిటి విషయంలోను ఇదే వర్తిస్తుంది. కామాదులలో ఏ మనోభావమూ తప్పిదం కాదని భక్తుడు పలుకుతాడు. వాటి నన్నిటిని ఆతడు చేపట్టి అమోఘంగా భగవంతుడి వైపుకు మరలుస్తాడు.*