న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ।
భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః ॥ 5
న, చ, మత్ స్థాని, భూతాని, పశ్య, మే, యోగమ్, ఐశ్వరమ్,
భూతభృత్, న, చ, భూతస్థః, మమ, ఆత్మా, భూతభావనః.
భూతాని చ = మరియు, భూతాలు; న మత్ స్థాని = నాయందు ఉండుటలేదు; మే = నా; ఐశ్వరమ్యోగం = ఈశ్వర సంబంధమైన యోగాన్ని; పశ్య = చూడు; మమ = నా; ఆత్మా = స్వరూపం; భూతభృత్ = భూతాలను భరించేదీ; భూతభావనః = భూతాలను పోషించేదీ; (అయినప్పటికీ) న చ భూతస్థః = వాటి యందు ఉండుట లేదు.
తా ॥ ఐశ్వరమైన నా యోగాన్ని (అసాధారణమైన యోగ మాయా వైభవాన్ని) చూడు. భూతాలు (అసంగుడనైన) నాయందు ఉండడం లేదు. నా స్వరూపం భూతాలను ధరించునదీ, పాలించునదీ అయినప్పటికీ, నేను భూతాల యందు లేను. (జీవుడు శరీరాన్ని ధరించి పాలిస్తూ, అహంకారంతో తత్–సంశ్లిష్టుడై అందు వెలయుచున్నాడు. అదే విధంగా నేను భూతాలను ధరించి పాలిస్తున్నాను, అహంకార రహితుడనవడం వల్ల, వాటి యందు నేను ఉండడం లేదు.)
వ్యాఖ్య:–
కిందటి శ్లోకంలో ‘ప్రాణులన్నీ నాలోనే ఉన్నాయి’ అని చెప్పిన కృష్ణుడు, వెంటనే ఈ శ్లోకంలో ‘ప్రాణులేవీ నాలో లేవు’ అని ఎందుకు అంటున్నారు? ఇది పరస్పర విరుద్ధంగా ఉంది కదా? అని సందేహం రావచ్చు. దీనికి సమాధానం ఇది:
సామాన్య దృష్టి (మామూలు చూపు): సామాన్య ప్రజలకు ప్రపంచం నిజంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి, ‘ఈ ప్రపంచం దేవుడిలోనే ఉంది, ఆయనే దీనికి ఆధారం’ అని చెబుతారు. (ఇది ద్వైతం).
జ్ఞాన దృష్టి (నిజమైన చూపు): కానీ పరమ సత్యం (పరమార్థం) తెలిసిన వారికి, ‘రెండు’ అనేది ఉండదు. ఉన్నది ఒక్క దేవుడే. ఈ ప్రపంచం, ప్రాణులు అనేవి కేవలం భ్రమ మాత్రమే. ఆ భ్రమ తొలగిపోయినప్పుడు, ‘నాలో ప్రాణులు ఉన్నాయి’ అనే మాటకు అర్థమే ఉండదు కదా!
ఉదాహరణకు ఒక వ్యక్తి నిద్రలేచాక, ‘ఆ కల నాలో లేదు, నేను ఆ కలలో లేను’ అని ఎలా అంటాడో…తాడును చూసి పాము అని భ్రమపడి, తర్వాత టార్చ్ వేసి చూసాక ‘అసలు అక్కడ పాము లేనే లేదు’ అని ఎలా తెలుసుకుంటాడో…భగవంతుడు కూడా ఆ అత్యున్నత స్థితి (అద్వైత దృష్టి) నుంచి మాట్లాడుతూ, ‘ఈ ప్రపంచం ఒక కల లాంటిది. నిజానికి నాలో ఏమీ లేవు. నేను దేనిలోనూ లేను’ అని చెప్పారు.
పైకి చూస్తే దేవుడు లోకాన్ని రక్షిస్తున్నట్లు కనిపించినా, నిజానికి ఆయనకు ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన దేనికీ అంటుకోరు (నిర్లిప్తుడు). ఇదే దేవుడి అద్భుతమైన ‘యోగమాయ’ అని అర్జునుడికి వివరించారు. చివరగా, నిజమైన జ్ఞానం కలిగినప్పుడు, ఈ ప్రపంచం వేరుగా కనిపించదు. అంతా దేవుడి స్వరూపంగానే (బ్రహ్మముగానే) కనిపిస్తుంది.
శ్రీ రామకృష్ణులు: “అనేక మార్గాలు ఉన్నాయి; అన్నీ భగవంతుని చేరటానికే! ఒక్కో మతం ఒక్కో మార్గం. ఉదాహరణకు కాళికాలయాన్ని విభిన్న మార్గాల ద్వారా చేరుకోవచ్చు. కొన్ని మార్గాలు పరిశుభ్రంగా ఉంటాయి, కొన్ని అపరిశుభ్రమైనవి. పరిశుభ్రమైన మార్గం గుండా పోవటం మంచిది.
“అనేక మతాలు, అనేక మార్గాలు; అన్నిటిని చూసేశాను. వాటిలో ఇప్పుడు నాకు ఆసక్తి లేదు. అన్నీ పరస్పరం కలహించుకుంటున్నాయి. ఇక్కడ ఎవరూ అన్యులు లేరు, మీరు నా సొంత మనుష్యులు. మీతో చెబుతున్నాను. నేను చివరగా తెలుసుకున్నది ఇదే: భగవంతుడు పూర్ణుడు, నేను ఆయన అంశం. ఆయన ప్రభువు, నేను ఆయన దాసుడను. మళ్ళీ, కొన్ని వేళల్లో ఆయనే నేను, నేనే ఆయన అనీ భావిస్తాను.”
భక్తులు నిశ్చలంగా కూర్చుని వింటున్నారు. (Source: శ్రీ రామకృష్ణ కథామృతం)
—–
(‘మ’ తో) “అసలు విషయం ఏమిటో తెలుసా? భగవంతుడే సత్యం, తక్కినవన్నీ అనిత్యం. జీవులు, జగత్తు, ఇల్లూవాకిలీ, పిల్లాజల్లా – ఇవన్నీ గారడీవాడి గారడీయే. గారడీవాడు కర్రతో డోలును వాయిస్తూ ‘క్షూ క్షూ మంత్ర కాళీ! రండి, గారడీ చూడండి’ అంటూంటాడు. ప్రేక్షకులతో ‘రండి, ఈ కుండ మీది మూత తీయండి’ అంటాడు. మూత తీయగానే కుండలో నుంచి అనేక పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కాని గారడీవాడే సత్యం; వాడు చేసే గారడీ అంతా అనిత్యం. అనిత్యమనేది ఇప్పటికిప్పుడు ఉంటుంది; ఇంతలోనే మాయమైపోతుంది. ఒకసారి కైలాసంలో శివుడు కూర్చొని ఉన్నప్పుడు నంది ఆయనకు సమీపంలో ఉన్నాడు. హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వినవచ్చింది. ‘స్వామీ, ఇదేమి శబ్దం’ అని నంది ప్రశ్నించగా శివుడు ‘రావణుడు జన్మించాడు. అందుకే ఈ శబ్దం!’ అని బదులిచ్చాడు. కాస్సేపటి తర్వాత మళ్ళీ మరో భయంకర శబ్దం వినవచ్చింది. నంది మళ్ళీ ‘ప్రభూ ఇదేమి శబ్దం?’ అని అడగ్గా శివుడు నవ్వుతూ ‘ప్రస్తుతం రావణ వధ జరిగింది’ అన్నాడు. చావు పుట్టుకలు – ఇవన్నీ గారడీలాంటివి. ఈ క్షణంలో ఉంటాయి, ఇంతలోనే కనుమరుగైపోతాయి. భగవంతుడే సత్యం, తక్కినవన్నీ అనిత్యం. నీరు మాత్రమే సత్యం; అయితే నీటిబుడగ లనేవి ఇప్పుడు ఉంటాయి, మరుక్షణంలో ఉండవు. నీటి బుడగలు నీటిలో కలసిపోతాయి. ఏ నీటి నుండి అయితే పుట్టాయో ఆ నీటిలోనే లయమైపోతాయి.
“భగవంతుడు మహాసముద్రం లాంటివాడు, జీవులు అందులోని బుడగల లాంటివారు. వారు అందులోనే జన్మిస్తారు, అందులోనే లయమైపోతారుకూడా. పిల్లలు ఒక పెద్ద బుడగతోపాటు ఉన్న చిన్న బుడగలవంటివారు.
“భగవంతుడే సత్యం. ఆయనపట్ల భక్తి పెంపొందించుకోవడానికి, ఆయన్ను సాక్షాత్కరించు కోవడానికి ప్రయత్నించండి. దుఃఖీంచడం వల్ల ఏమిటి ప్రయోజనం?” (Source: శ్రీ రామకృష్ణ కథామృతం)