అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ ।
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ॥ 30
అపి, చేత్, సు దురాచారః, భజతే, మామ్, అనన్యభాక్,
సాధు, ఏవ, సః, మంతవ్యః, సమ్యక్, వ్యవసితః, హి, సః.
సు దురాచారః అపి = అతి దుర్మార్గుడైనా; అనన్యభాక్ = ఏకాంతభక్తితో; మామ్ = నన్ను; భజతే చేత్ = భజించిన ఎడల; సః = వానిని; సాధుః ఏవ = సాధువనియే; మంతవ్యః = ఎన్నదగును; హి = ఏమన; సః = వాడు; సమ్యక్ = చక్కగా (భగవద్భజనతో కృతార్థుడనవుతానని); వ్యవసితః = నిశ్చయించుకున్నాడు.
తా ॥ (మరియు, నా భక్తికి గల అవితర్క్య ప్రభావం ఎటువంటిదంటే:) అత్యంత దుర్మార్గుడైనవాడు కూడా అనన్యచిత్తుడై నన్ను భజిస్తే, అతణ్ణి సాధువనియే పరిగణించవచ్చు. ఎందుకంటే, అతని సంకల్పం మిక్కిలి ఉత్తమమైనది. అతడు భగవద్భజన చేత కృతార్థుడనవుతానని నిశ్చయించుకున్నాడు.