శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః ।
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ॥ 28
శుభ అశుభ ఫలైః, ఏవమ్, మోక్ష్యసే, కర్మబంధనైః,
సన్న్యాస యోగ యుక్త ఆత్మా, విముక్తః, మామ్, ఉప ఏష్యసి.
ఏవమ్ = ఇలా ఆచరించినచో; శుభ అశుభ ఫలైః = ఇష్టానిష్టఫలవిశిష్టాలైన; కర్మబంధనైః = కర్మబంధాల నుండి; మోక్ష్యసే = ముక్తుడవవుతావు; సన్న్యాస యోగ యుక్త ఆత్మా = కర్మ సమర్పణ యోగయుక్తుడవై; విముక్తః = జీవితకాలంలోనే ముక్తి పొంది; మామ్ = నన్ను; ఉప ఏష్యసి = దేహాంతాన పొందుతావు.
తా ॥ ఈ విధంగా సమస్త కర్మలను నాకు అర్పిస్తే, నీవు ఇష్టానిష్టాలతో కూడిన కర్మబంధాల నుండి ముక్తుడవవుతావు. నాకు శుభాశుభాలైన కర్మలను అర్పించడం అనే (సన్న్యాస) యోగాన్ని* ఆశ్రయిస్తే, (ఇహజీవితంలోనే) ముక్తుడవు అవుతావు. (జీవన్ముక్తిని పొందుతావు;) దేహత్యాగానంతరం నన్ను పొందుతావు. మళ్ళీ ఇక జన్మించవు.