పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః ॥ 26
పత్రమ్, పుష్పమ్, ఫలమ్, తోయమ్, యః, మే, భక్త్యా, ప్రయచ్ఛతి,
తత్, అహమ్, భక్తి ఉపహృతమ్, అశ్నామి, ప్రయత ఆత్మనః.
యః = ఎవడు; మే = నాకు; భక్త్యా = భక్తితో; పత్రమ్ = ఆకునో; పుష్పమ్ = పువ్వునో; ఫలమ్ = పండునో; తోయమ్ = నీటినో; ప్రయచ్ఛతి = సమర్పించునో; ప్రయత ఆత్మనః = శుద్ధచిత్తుడైన ఆ నిష్కామ భక్తుని; భక్తి ఉపహృతమ్ = భక్తితో సమర్పించిన; తత్ = దానిని; అహమ్ = నేను; అశ్నామి = గ్రహిస్తున్నాను.
తా ॥ (నా భక్తులు అనావృత్తిరూపమైన అనంతఫలాన్ని పొందుతున్నారు, మరియు నా ఆరాధన అత్యంత సహజం.) ఎవడు నాకు భక్తితో ఆకునో, పువ్వునో, పండునో, నీటినో, అర్పిస్తున్నాడో, శుద్ధచిత్తుడైన ఆ నిష్కామభక్తుడు భక్తితో ఒసగిన కానుకను ప్రీతితో గ్రహిస్తున్నాను. (క్షుద్రదేవతలు బహువిత్త సాధ్యాలైన యాగాదులతో తృప్తి చెందుతున్నారు; కాని, మహావిభూతిపతినైన నన్ను అలా తృప్తిపరచడం సాధ్యం కాదు. అయినప్పటికీ, భక్తుణ్ణి అనుగ్రహించ డానికి అతడు అర్పించే పత్రపుష్పాదులను గ్రహిస్తున్నాను.)