అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ 22
అనన్యాః, చింతయంతః, మామ్, యే, జనాః, పరి ఉపాసతే,
తేషామ్, నిత్య అభియుక్తానామ్, యోగక్షేమమ్, వహామి, అహమ్.
అనన్యాః = అనన్యచిత్తంతో, (ఆత్మభావముతో); మామ్ = నన్ను (భగవంతుణ్ణి); చింతయంతః = చింతిస్తూ; యే = ఏ; జనాః = జనులు; పరి ఉపాసతే = భజిస్తున్నారో; నిత్య అభియుక్తానామ్ = అనవరతమూ యోగయుక్తులైన; తేషామ్ = వారి; యోగ క్షేమం = పొందనిదాన్ని పొందడం, పొందినదాన్ని రక్షించడం అనే విషయాల్ని; అహమ్ = నేను; వహామి = వహిస్తున్నాను.
తా ॥ (ఇక నా భక్తుల విషయానికి వస్తే, వారు నా ప్రసాదంతో కృతార్థులవు తున్నారు.) నన్ను ఆత్మభావంతో (అనన్యకాములవుతూ) చింతన చేస్తూ, ధ్యానించే (సేవించే) ఏకనిష్ఠుల యోగాన్ని (ధనాది లాభం), క్షేమాన్ని (తత్ రక్షణను, మోక్షాన్ని వారు ప్రార్థింపకపోయినా) నేనే వహిస్తున్నాను – పొందజేస్తున్నాను.
Sri Ramakrishna Says —
భక్తులు గదిలో ఉన్నారు. హాజ్రా వసారాలో కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: హాజ్రాకు ఏం కావాలో తెలుసా? డబ్బు కావాలి, కుటుంబంలో ఇబ్బంది. కొంత అప్పు కూడా ఉంది. జపధ్యానాలు చేస్తున్నందున భగవంతుడు డబ్బు ఇస్తాడని అతడు అనుకుంటాడు.
ఒక భక్తుడు: భగవంతుడు మన కోర్కెలను నెరవేర్చడా?
శ్రీరామకృష్ణులు: అది ఆయన ఇచ్ఛ. కాని మరో విషయం; భక్తుడు ప్రేమోన్మాదుడు కానంత వరకు ఆయన, భక్తుడి భారాన్ని యావత్తూ తన మీద వేసుకోడు. చిన్నపిల్లలను చేతులు పుచ్చుకుని లాక్కువచ్చి భోజనాల పంక్తిలో తమ ప్రక్కన కూర్చో పెట్టుకుంటారు. పెద్దవాళ్ళను అలా ఎవరు పిలుచుకు వస్తారు? భగవచ్చింతనలో నిమగ్నమై తన భారాన్ని తాను వహించలేని స్థితిలో ఉన్న వ్యక్తి భారాన్ని భగవంతుడు వహిస్తాడు. (Source: శ్రీ రామకృష్ణ కథామృతం)