శ్రీభగవానువాచ :
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే ।
జ్ఞానం విజ్ఞానసహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ॥ 1
ఇదమ్, తు, తే, గుహ్యతమమ్, ప్రవక్ష్యామి, అనసూయవే,
జ్ఞానమ్, విజ్ఞానసహితమ్, యత్, జ్ఞాత్వా, మోక్ష్యసే, అశుభాత్.
యత్ = దేనిని; జ్ఞాత్వా = తెలుసుకుంటే; అశుభాత్ = సంసారబంధం నుండి; మోక్ష్యసే = విడివడగలవో; (అట్టి) ఇదమ్ = ఈ; గుహ్యతమమ్ = అత్యంత రహస్యమైనదీ; విజ్ఞానసహితమ్ = అనుభవ యుక్తమైనదీ; (అయిన) జ్ఞానమ్ = బ్రహ్మజ్ఞానాన్ని; అనసూయవే* = అసూయారహితుడవైన; తే తు = నీకే; ప్రవక్ష్యామి = చెబుతున్నాను.
తా ॥ (అచింత్యమైన తన ఐశ్వర్యాన్ని, భక్తికి గల అసాధారణ ప్రభావాన్ని వర్ణిస్తూ-) శ్రీభగవానుడు పలికెను: (ధర్మజ్ఞానం గుహ్యమైనది, దానికంటే దేహాది వ్యతిరిక్తమైన ఆత్మజ్ఞానం గుహ్యతరమైనది.) దానికంటే కూడా అత్యంత రహస్యమైన బ్రహ్మజ్ఞానాన్ని అనుభవ జ్ఞాన (ఉపాసనా) సహితంగా దోషదృష్టి లేని నీకు ఉపదేశిస్తున్నాను; దీనిని గ్రహిస్తే అశుభకరమైన సంసార బంధనం నుండి వెనువెంటనే ముక్తిని పొందగలవు.