సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః ।
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ॥ 14
సతతమ్, కీర్తయంతః, మామ్, యతంతః, చ, దృఢవ్రతాః,
నమస్యంతః, చ, మామ్, భక్త్యా, నిత్యయుక్తాః, ఉపాసతే.
(వారు) సతతమ్ = సదా; మామ్ = నన్ను; కీర్తయంతః = కీర్తించే వారూ; దృఢవ్రతాః = సడలని నిష్ఠగలవారూ; యతంతః చ = ప్రయత్నశీలురూ; భక్త్యా = పరమప్రీతిచేత; నమస్యంతః = నమస్కరిస్తున్నవారూ; నిత్యయుక్తాః చ = సర్వదా సమాహితచిత్తులూ అయి; మామ్ = నన్ను; ఉపాసతే = ఉపాసిస్తారు.
తా ॥ (వారి భజన ప్రకారం చెప్పబడుతోంది:) ఆ మహాత్ములు నన్ను స్తోత్ర మంత్రాలతో కీర్తిస్తున్నారు. దృఢనియమం గలవారై ఈశ్వరజ్ఞానాన్ని పొంద ప్రయత్నిస్తున్నారు. పరమప్రీతిపూర్వకంగా ప్రణమిల్లుతున్నారు. అనవరతం అవహిత చిత్తులవుతూ నన్ను ఉపాసిస్తున్నారు.