శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే ।
ఏకయా యాత్యనావృత్తిం అన్యయావర్తతే పునః ॥ 26
శుక్ల కృష్ణే, గతీ, హి, ఏతే, జగతః, శాశ్వతే, మతే,
ఏకయా, యాతి, అనావృత్తిమ్, అన్యయా, ఆవర్తతే, పునః.
హి = ఏమన; జగతః = జగత్తుకు; శుక్ల =శుక్లం (దేవయానం, ఉత్తరమార్గం); కృష్ణే = కృష్ణం (పితృయానం, దక్షిణమార్గం అనే); ఏతే = ఈ రెండూ; గతీ = దారులూ; శాశ్వతే = నిత్యాలు, అనాదులు అని; మతే = తలచబడుతున్నాయి; ఏకయా = ఒకదానిచేత (శుక్లమార్గంలో); అనావృత్తిమ్ = అపునరావృత్తిని (మోక్షాన్ని); యాతి = పొందును; అన్యయా = మరొకదానిచేత (కృష్ణమార్గంలో); పునః = మరల; ఆవర్తతే = వచ్చి జన్మించును.
తా ॥ జగత్తులో జ్ఞానాధికారులకు, కర్మాధికారులకు ప్రకాశమయమైన శుక్లగతియూ, తమోమయమైన కృష్ణగతియూ (సంసారం ప్రవాహరూపంలో నిత్యమవడం వల్ల) శాశ్వతాలని గ్రహించు. దేవయాన మార్గంలో ప్రయాణించిన వాడు (క్రమ) ముక్తి పొందుతున్నాడు. పితృయాన మార్గంలో జనినవాడు తిరిగొచ్చి మళ్ళీ జన్మిస్తున్నాడు. (గీత : 9–21; వేదాంత సూత్రమ్. 3–1–8 చూ:)