యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ।
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ॥ 23
యత్ర, కాలే, తు, అనావృత్తిమ్, ఆవృత్తిమ్, చ, ఏవ, యోగినః,
ప్రయాతాః, యాంతి, తమ్, కాలమ్, వక్ష్యామి, భరతర్షభ.
భరతర్షభ = భరతశ్రేష్ఠా; యత్ర కాలే = ఏ కాలంలో (ఏ మార్గంలో); ప్రయాతాః తు = ప్రయాణిస్తే; యోగినః = ఉపాసకులూ (కర్మిష్ఠులూ); (యథాక్రమంగా) అనావృత్తిమ్ = ముక్తిని; ఆవృత్తిం చ = పునర్జన్మను; యాంతి ఏవ = పొందుతారో; తమ్ = ఆ; కాలమ్ = కాలాన్ని గురించి; వక్ష్యామి = చెబుతాను.
తా ॥ (‘పరమేశ్వరోపాసకులు తత్పదాన్ని పొంది, మళ్ళీ జన్మను పొందరు, ఇతరులు జన్మిస్తారు’ – అని చెప్పబడింది. ఇక, ఏ మార్గంలో ప్రయాణించిన వారు జన్మిస్తారో, మరి ఏ మార్గాన్ని అనుసరిస్తే వారు జన్మించరో చెప్పబడుతోంది:) భరతర్షభా! ఏ కాలంలో* మృతులైతే ఉపాసకులు (ధ్యానయోగులు) కర్మిష్ఠులు (సకామ కర్మమొనర్చే వారూ) యథాక్రమంగా మోక్షాన్ని, పునర్జన్మను పొందుతారో, ఆ కాలాన్ని గురించి చెబుతాను.