పరస్తస్మాత్తు భావోఽన్యో అవ్యక్తోఽవ్యక్తాత్ సనాతనః ।
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ॥ 20
పరః, తస్మాత్, తు, భావః, అన్యః, అవ్యక్తః, అవ్యక్తాత్, సనాతనః,
యః, సః, సర్వేషు, భూతేషు, నశ్యత్సు, న, వినశ్యతి.
తు = కాని; తస్మాత్ = ఆ; అవ్యక్తాత్ = ప్రజాపతి నిద్రా రూపమైన అవ్యక్తం కంటే; పరః = వేరైన; అన్యః = మరొక; అవ్యక్తః = ఇంద్రియ అగోచరమూ; సనాతనః = అనాదీ అయిన; యః = ఏ; భావః = బ్రహ్మస్వరూపం; (కలదో) సః = అది; సర్వేషు భూతేషు = సమస్తభూతాలూ; నశ్యత్సు = వినష్టమైనప్పటికీ; న వినశ్యతి = వినాశం పొందదు.
తా ॥ (అక్షరబ్రహ్మ యొక్క స్వరూపం ఈ రెండు శ్లోకాలలో వర్ణించ బడుతోంది:) ప్రజాపతి నిద్రావస్థయైన అవ్యక్తం కంట వేరైనదీ* , చక్షురాది ఇంద్రియాలకు అగోచరమైనదీ, స్వతంత్రమైనదీ అయిన ఏ చేతనబ్రహ్మ స్వరూపం కలదో; అది స్థావరజంగమాదులైన సర్వభూతాలు నశించినా నశించదు.