భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే ।
రాత్ర్యాగమేఽవశః పార్థ ప్రభవత్యహరాగమే ॥ 19
భూతగ్రామః, సః, ఏవ, అయమ్, భూత్వా, భూత్వా, ప్రలీయతే,
రాత్రి ఆగమే, అవశః, పార్థ, ప్రభవతి, అహరాగమే.
పార్థ = అర్జునా; సః ఏవ = పూర్వం ఉన్న; అయమ్ = ఈ; భూతగ్రామః = ప్రాణిసమూహమే; భూత్వాభూత్వా = మళ్ళీ మళ్ళీ పుట్టి; రాత్రి ఆగమే = బ్రహ్మ యొక్క రాత్రి అయినప్పుడు; ప్రలీయతే = లయమవుతోంది; అహరాగమే = బ్రహ్మయొక్క పగలు అయినప్పుడు; అవశః = తమ తమ కర్మలకు అధీనమై; ప్రభవతి = ఉత్పన్నమవుతోంది.
తా ॥ పార్థా! (పూర్వకల్పంలో ఉన్న) ఆ భూతసమూహమే మళ్ళీ మళ్ళీ పుడుతూ బ్రహ్మ యొక్క రాత్రి అయిన వెంటనే లయమవుతున్నాయి; మరియు, బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే తమ తమ కర్మలకు లోనై మళ్ళీ జన్మిస్తున్నాయి. (మను స్మృతిః. 1–52 చూ.)
వ్యాఖ్య:-
పూర్వ కల్పంలో ఉన్న జీవులే, తమ కర్మలను బట్టి మళ్ళీ ఈ కల్పంలో పుడుతున్నారు. కొత్తగా ఎవరూ రావడం లేదు, పాత జీవులే ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ జీవుడిని ‘అవశుడు’ అన్నారు. అంటే తన చేతిలో ఏమీ లేనివాడు, పరాధీనుడు అని అర్థం. ఎందుకు? అంటే ‘ఆశలు, కోరికలు’ అనే సంకెళ్లతో బంధించబడి ఉన్నాడు కాబట్టి. జైలులో ఉన్న ఖైదీకి ఇష్టం ఉన్నా లేకపోయినా జైలు అధికారి చెప్పినట్లు వినాలి కదా! అలాగే జీవుడు కర్మ చెప్పినట్లు వినాల్సిందే. సాధారణంగా చనిపోవడం అంటే జీవితానికి ముగింపు కాదు, అది కేవలం ఒక ‘కామా’ (Comma) మాత్రమే. అంటే వాక్యం ఇంకా అవ్వలేదు, మళ్ళీ ఇంకో జన్మతో కంటిన్యూ అవుతుంది. మనం అజ్ఞానంతో ఇప్పటిదాకా కామాలు పెడుతూనే వచ్చాం. ఇప్పుడు అదృష్టవశాత్తు ఈ మానవ జన్మ దొరికింది. ఇప్పుడైనా జ్ఞానాన్ని సంపాదించుకుని, దేవుడిని చేరి, ఈ జననమరణాల చక్రానికి శాశ్వతంగా ‘ఫుల్ స్టాప్’ (Full stop) పెట్టేయాలి. అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. ఎన్నో కోట్ల జన్మల తర్వాత పుణ్యం కొద్దీ మనిషిగా పుట్టాం. ఈ అవకాశాన్ని వృథా చేసుకోకుండా, దేవుడిని ఆశ్రయించి బయటపడటమే తెలివైన పని.