వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున ।
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ॥ 26
వేద, అహమ్, సమతీతాని, వర్తమానాని, చ, అర్జున,
భవిష్యాణి, చ, భూతాని, మామ్, తు, వేద, న, కశ్చన.
అర్జున = పార్థా; సమతీతాని = గతించినవీ; చ = మరియూ; వర్తమానాని = ఇప్పుడు ఉన్నవీ; భవిష్యాణి చ = మరి కలుగబోవునవీ అయిన; భూతాని = ప్రాణులనన్నిటిని; అహమ్ = నేను; వేద = ఎరుగుదును; తు = కాని; మామ్ = నన్ను; కశ్చన = ఎవరూ; న వేద = ఎరుగరు.
తా ॥ (కాని, నేను సర్వోత్తముణ్ణి, నా జ్ఞానశక్తి అనావృతం) పార్థా! నేను త్రికాలజ్ఞుడను. భూతభవిష్యద్వర్తమాన విషయాలనన్నింటినీ ఎరుగుదును. కాని, నన్ను (నాశరణాగతుడైన భక్తుడు తప్ప) ఎవ్వరూ ఎరుగజాలరు.