నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ॥ 25
న, అహమ్, ప్రకాశః, సర్వస్య, యోగమాయా సమావృతః,
మూఢః, అయమ్, న, అభిజానాతి, లోకః, మామ్, అజమ్, అవ్యయమ్.
అహమ్ = నేను; యోగ మాయా = యోగమాయ చేత; సమావృతః = ఆవృతమవడం వల్ల; సర్వస్య = అందరికీ; న ప్రకాశః = కనబడుటలేదు; (అందుచేత) అయమ్ = ఈ; మూఢః = మోహాచ్ఛన్నమైన; లోకః = జగత్తు; అజమ్ = జన్మరహితునిగా; అవ్యయమ్ = అవ్యయునిగా; మామ్ = నన్ను; న అభిజానాతి = గ్రహింపజాలకుంది.
తా ॥ (అల్పబుద్ధులైన వారి అజ్ఞానానికి కారణం) త్రిగుణాత్మకమైన మాయ* చేత ఆవృతుడనై నేనందరికీ గోచరింపకున్నాను –కేవలం నా భక్తునికే ప్రకాశితుడ నవుతున్నాను. కనుక, మోహాంధకారమైన ఈ జగత్తు నా జన్మ మృత్యు రహితమైన అవ్యయ (ఈశ్వరుని) స్వరూపాన్ని గ్రహింపజాలకున్నది.