కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః ।
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్స్వయా ॥ 20
కామైః, తైః, తైః, హృత జ్ఞానాః, ప్రపద్యంతే, అన్య దేవతాః,
తమ్, తమ్, నియమమ్, ఆస్థాయ, ప్రకృత్యా, నియతాః, స్వయా.
తైః తైః = ఆయా; కామైః = పుత్రపశుస్వర్గాది విషయవాంఛలచే; హృత జ్ఞానాః = నష్టవివేకులైనవారు; తం తం = ఆయా కోరికలకు తగిన; నియమమ్ = జప ఉపవాసాది నియమాలను; ఆస్థాయ = ఆచరించి; స్వయా = తమ; ప్రకృత్యా = స్వభావం చేత; నియతాః = వశీకృతులై; అన్యదేవతాః = వాసుదేవునికంటే ఇతరులైన దేవతలను; ప్రపద్యంతే = సేవిస్తున్నారు.
తా ॥ [సకామకర్మపరులు కూడా పరమేశ్వరుణ్ణి భజించి కామాలను పొంది క్రమంగా ముక్తులవుతారని వెనుక (గీత : 3–10; 4–30) చెప్పబడింది. ఇప్పుడు, అత్యంత రజస్తమోభిభూతులైన వారి నడవడి చెప్పబడుతోంది:] పుత్రపశు-స్వర్గాది వాంఛల చేత నష్టవివేకులైన వారు జప-ఉపవాసాదులను ఆచరిస్తూ, తమ స్వభావానుగుణంగా వాసుదేవేతరాలను, అంటే పరమాత్మేతరాలైన భూతప్రేత-యక్షాది దేవతా విశేషాలను సేవిస్తున్నారు.
వ్యాఖ్య:-
కొందరు పరమాత్మను (అసలైన దేవుడిని) వదిలేసి, చిన్న చిన్న కోరికల కోసం ఇతర దేవతలను ఎందుకు పూజిస్తారు? అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఉంది. మనుషులు తమ తెలివిని (వివేకాన్ని) కోల్పోవడం వల్లే ఇలా చేస్తున్నారు. అసలు ఆ తెలివి ఎక్కడికి పోయింది? మన మనసు అనే ఇంట్లో “కోరికలు” అనే దొంగలు చొరబడ్డారు. ఈ దొంగలు లోపలికి వచ్చి, మన దగ్గర ఉన్న వివేకాన్ని, జ్ఞానాన్ని దోచుకుపోయారు (కామైః హృతజ్ఞానాః). అందుకే మనిషికి ఏది గొప్పదో (పరమాత్మ), ఏది చిన్నదో (కోరికలు) తెలియట్లేదు. జ్ఞానం పోయింది కాబట్టి.. వీరు మోక్షం గురించి ఆలోచించరు. కేవలం “నాకు ఆ పని అవ్వాలి, ఈ లాభం రావాలి” అని మాత్రమే ఆలోచిస్తూ, వాటిని ఇచ్చే ఇతర దేవతలను పూజిస్తారు. కఠినమైన నియమాలు, వ్రతాలు చేస్తారు. కానీ వారి లక్ష్యం దేవుడు కాదు, కోరికలు తీరడం మాత్రమే. మోక్షం నిజంగా కావాలనుకునే సాధకులు చేయాల్సింది ఇది కాదు. అనవసరమైన కోరికలను చంపుకోవాలి. ఇంద్రియాలను (కళ్లు, చెవులు, మనసు) అదుపులో పెట్టుకోవాలి. మన గుండెలో ఉన్న ఆ పరమాత్మను మాత్రమే నిరంతరం ధ్యానించాలి. ఇదే ముక్తికి సరైన దారి.
గీతలో “కామైః హృతజ్ఞానాః” అని వాడారు. దీని అర్థం చాలా స్పష్టం: మనలోని ప్రాపంచిక కోరికలు (విషయ వాంఛలు) మన విజ్ఞానాన్ని దొంగిలించి, నాశనం చేస్తాయి. కోరిక పుట్టినప్పుడు మనిషి జ్ఞానం ఎలా నశిస్తుందో తెలిపే క్రమం (Ladder of Fall) గీతలో స్పష్టంగా ఉంది. కోరిక తీరకపోతే కోపం, ఆపై మోహం, చివరకు బుద్ధి నాశనం జరుగుతుంది. ఈ కోరికలు భగవంతుడి మార్గంలో వెళ్లేవారికి పెద్ద ఆటంకాలు, మహా ప్రమాదకరమైనవి. కాబట్టి, తెలివైన వారు (విజ్ఞులు) వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు. వాటిని దరిచేరనీయకూడదు.
ఈ అధ్యాయమున 15వ శ్లోకమున చెప్పబడిన ‘మాయయా పహృతజ్ఞానాః’ – కోరికలచే అపహరింపబడిన జ్ఞానముగల మూఢులకును, ఈ శ్లోకమున చెప్పబడిన ‘కామైఃహృతజ్ఞానాః’ – కోరికలచే అపహరింపబడిన జ్ఞానముగలవారికిని చాల తారతమ్యముగలదు. మొదటివారు తమోగుణప్రేరితులు. వీరు సత్త్వగుణ రజోగుణ మిశ్రితమగు గుణము కలవారు. వీరికి దైవమందు విశ్వాసముకలదు. వారికిలేదు.
