సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు ।
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ॥ 9
సుహృత్ మిత్రా అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు,
సాధుషు, అపి, చ, పాపేషు, సమబుద్ధిః, విశిష్యతే.
సుహృత్ మిత్ర = సుహృదుడు, మిత్రుడు; అరి ఉదాసీన, మధ్యస్థ ద్వేష్య, బంధుషు = శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు-వీరియందూ; సాధుషు = సాధువులందూ (శాస్త్రాన్ని అనుసరించే వారియందూ); పాపేషు అపి చ = దురాచారుల యందూ కూడా; సమబుద్ధిః = సమబుద్ధి, రాగద్వేష శూన్యుడైనవాడు; విశిష్యతే = శ్రేష్ఠుడు, యోగారూఢుడు అవుతున్నాడు.
తా ॥ సుహృదుడు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు, సదాచారి, దురాచారి– వీరందరియందూ కూడా సమబుద్ధి (బ్రహ్మ బుద్ధి) కలవాడే, (రాగ, ద్వేషాది శూన్యుడే) యోగారూఢుడు అని చెప్పబడతాడు.