జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ॥ 7
జితాత్మనః, ప్రశాంతస్య, పరమాత్మా, సమాహితః,
శీత ఉష్ణ సుఖదుఃఖేషు, తథా, మాన అపమానయోః.
జితాత్మనః = జితేంద్రియుడూ; ప్రశాంతస్య = ఉపశాంతుడూ అయిన వానికి; శీత ఉష్ణ సుఖ దుఃఖేషు = శీతోష్ణ సుఖదుఃఖాలలోను; తథా = మరియు; మాన అపమానయోః = సమ్మాన తిరస్కారాలను పొందేటప్పుడూ; పరమాత్మా = పరమాత్మ; సమాహితః = సాక్షిగా ఆత్మభావంలో ఉంటాడు.
తా ॥ జితేంద్రియుడూ, ప్రశాంతుడూ అయిన సన్న్యాసి శీతోష్ణాలను, సుఖఃదుఖాలను, సమ్మానతిరస్కారాలను పొందేటప్పుడు కూడా పరమాత్మయందే సమాహితుడై ఉంటాడు. ద్వంద్వాల చేత చలించడు.
వ్యాఖ్య:-
సాధారణ మనుషుల మనస్సు… చలి-వేడి, సుఖం-దుఃఖం, మానం-అవమానం వంటివి ఎదురైనప్పుడు తలకిందులైపోతుంది. తన సమతుల్యతను (Balance) కోల్పోయి చంచలంగా మారుతుంది. సుఖం వస్తే పొంగిపోవడం, కష్టం వస్తే కుంగిపోవడం…ఎవరైనా పొగిడితే ఉబ్బిపోవడం, తిడితే దిగులుపడటం జరుగుతూ ఉంటుంది. ఇలా అజ్ఞాని అయిన మనిషి ఈ ‘ద్వంద్వాలకు’ (సుఖదుఃఖాలకు) బానిస అయిపోయి, వాటి దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాడు. అందుకే అతనికి ఒక్క క్షణం కూడా మనశ్శాంతి ఉండదు. కానీ, మనస్సును మరియు ఇంద్రియాలను జయించిన వారి పరిస్థితి ఇలా ఉండదు. ఎన్ని కష్టసుఖాలు (ద్వంద్వాలు) వచ్చినా సరే, వారి మనస్సు నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటూ ఆ పరమాత్మ మీదే నిలిచి ఉంటుంది. సముద్రపు అలలు గానీ, చిన్న చిన్న గాలులు గానీ ఒక మహా పర్వతాన్ని ఎలాగైతే కదిలించలేవో… అలాగే ఈ సుఖదుఃఖాలు మనస్సును జయించిన వాడిని (జితమానసుడిని) ఏమాత్రం కదిలించలేవు. అతడు ఎప్పుడూ ఆ పరమాత్మలోనే స్థిరంగా ఉంటూ గొప్ప శాంతిని అనుభవిస్తాడు. కాబట్టి, అభ్యాసం, వైరాగ్యం, వివేకం ద్వారా మనస్సును, ఇంద్రియాలను ఎలాగైనా సరే జయించడం చాలా ముఖ్యమని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది.
కొందరు పండితులు ‘ప్రశాంతస్య’ (ప్రశాంతంగా ఉన్నవాడు) అనే పదాన్ని… శీతోష్ణాలకు (చలి-వేడి) జతచేసి ఇలా అర్థం చెప్పారు: “చలి-వేడి, సుఖం-దుఃఖం వంటివి వచ్చినా ఏమాత్రం చలించకుండా (Disturb కాకుండా) ఎవడైతే పరమ శాంతంగా ఉంటాడో… వాడి మనసు ఎప్పుడూ పరమాత్మ అనుభవంలోనే నిలిచి ఉంటుంది.” ఎలా చెప్పుకున్నా సారాంశం (భావం) ఒక్కటే.