కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి ।
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ॥ 38
కచ్చిత్, న, ఉభయవిభ్రష్టః, ఛిన్న అభ్రమ్, ఇవ, నశ్యతి,
అప్రతిష్ఠః, మహాబాహో, విమూఢః, బ్రహ్మణః, పథి.
మహాబాహో = కృష్ణా; బ్రహ్మణః పథి = బ్రహ్మలాభమార్గంలో; విమూఢః = మూఢుడు, కలత చెందినవాడూ; అప్రతిష్ఠః = నిరాశ్రయుడూ; ఉభయవిభ్రష్ఠః = కర్మ, ధ్యానాలు రెండింటికీ చెడినవాడై; ఛిన్న అభ్రం ఇవ = చెదరిన మేఘం వలె; న నశ్యతి కచ్చిత్ = చెడడు కదా?
తా ॥ కృష్ణా! బ్రహ్మప్రాప్తి పథంలో కర్మ ధ్యాన మార్గాల నుండి భ్రష్టుడూ,* విమూఢుడూ, నిరాశ్రయుడూ అయిన యోగి చెదరిన మేఘం వలె* వినాశాన్ని పొందడు కదా?
వ్యాఖ్య:-
ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టినా, అందులో స్థిరపడలేకపోయిన వ్యక్తి గురించి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ‘ఉభయవిభ్రష్టః’ (రెండింటికీ చెడినవాడు) అనే పదానికి పండితులు రెండు రకాల అర్థాలు చెప్పారు. కొందరు దీనిని ‘కర్మమార్గం, యోగమార్గం రెండింటి నుంచీ జారిపోయినవాడు’ అని వివరిస్తే, మరికొందరు ‘స్వర్గం, మోక్షం రెండింటినీ పోగొట్టుకున్నవాడు’ అని అర్థం చెప్పారు.