అర్జున ఉవాచ :
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ॥ 37
అయతిః, శ్రద్ధయా, ఉపేతః, యోగాత్, చలిత మానసః,
అప్రాప్య, యోగసంసిద్ధిమ్, కామ్, గతిమ్, కృష్ణ, గచ్ఛతి.
అర్జునః = అర్జునుడు; ఉవాచ = పలికెను; కృష్ణ = కృష్ణా; శ్రద్ధయా ఉపేతః =శ్రద్ధా అయుక్తుడూ; అయతిః = నియమహీనుడూ అయిన వాడు; యోగాత్ = యోగం నుండి; చలిత మానసః = భ్రష్టచిత్తుడై యోగ–సంసిద్ధిమ్ = యోగసిద్ధిని; అప్రాప్య = పొందక; కామ్ = ఎట్టి; గతిమ్ = గతిని; గచ్ఛతి = పొందును?
తా ॥ అర్జునుడు పలికెను: కృష్ణా! శ్రద్ధతో యోగసాధనను ఆరంభించినా నియమరాహిత్యం చేత యోగభ్రష్టచిత్తుడు యోగసిద్ధిని (జ్ఞానాన్ని) పొందడు. మరి వాడు ఎట్టి గతిని పొందుతున్నాడు?
వ్యాఖ్య: –
మనస్సును పూర్తిగా అదుపులో ఉంచుకుంటేనే యోగసిద్ధి (ఆత్మసాక్షాత్కారం) కలుగుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఒక వ్యక్తికి యోగం పట్ల, ధ్యానం పట్ల, గురువుగారి మాటల పట్ల ఎంతో శ్రద్ధ, నమ్మకం ఉన్నాయి. అతను సాధన కూడా చేస్తున్నాడు. కానీ, అతని మనస్సు మాత్రం ధ్యానంలో నిలకడగా ఉండటం లేదు, అది అతని అదుపులోకి రావడం లేదు. అలాంటి వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోకుండానే చనిపోతే, అతని పరిస్థితి (గతి) ఏమవుతుంది? అని అర్జునుడు అడిగాడు.
నిజానికి ఈ సందేహం లోకంలో చాలామందికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే, ఈ జన్మలోనే మోక్షం పొందాలనేంత తీవ్రమైన పట్టుదలతో ప్రయత్నించేవారు చాలా అరుదుగా ఉంటారు. సామాన్యంగా ఉంటూ, ఎంతో కొంత నిష్ఠతో దైవకార్యాలు చేసేవారే ఎక్కువమంది ఉంటారు. కాబట్టి, యోగంలో అత్యున్నత స్థితికి చేరుకోకముందే హఠాత్తుగా మరణిస్తే తమ గతి ఏమవుతుందో అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అందువల్ల అర్జునుడు అడిగిన ఈ ప్రశ్న, దానికి భగవంతుడు ఇచ్చిన సమాధానం సాధకులకు ఎంతో ఉపయోగపడతాయి. శ్రద్ధాభక్తులు ఉన్నప్పటికీ, ఈ జన్మలో పరిపూర్ణత సాధించలేని చాలామంది తమకు ఎక్కడ అధోగతి (దుర్గతి) పడుతుందో అని భయపడుతుంటారు. అలాంటి వారి భయాన్ని అర్జునుడి ప్రశ్న, దానికి కృష్ణుడు చెప్పిన సమాధానం పూర్తిగా పోగొడతాయి.