యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ ।
న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ॥ 2
యమ్, సన్న్యాసమ్, ఇతి, ప్రాహుః, యోగమ్, తమ్, విద్ధి, పాండవ,
న, హి, అసన్న్యస్త సంకల్పః, యోగీ, భవతి, కశ్చన.
పాండవ = అర్జునా; (పెద్దలు) యమ్ = దేనిని; సన్న్యాసమ్ ఇతి = సన్న్యాసమని; ప్రాహుః = చెప్పారో; తమ్ = దానిని; యోగమ్ = యోగమని; విద్ధి = గ్రహించు; హి = ఏమన; అసన్న్యస్త సంకల్పః = సంకల్ప త్యాగి కాని యెడల; కశ్చన = ఎవ్వరూ కూడా; యోగీ = యోగి; న భవతి = కాజాలడు.
తా ॥ పాండవా! పెద్దలు సన్న్యాసమని చెప్పిన దానినే నిష్కామ కర్మానుష్ఠాన యోగంగా గ్రహించు. ఎందుకంటే, ఫలసంకల్ప త్యాగి కానివాడు (కర్మనిష్ఠ యందు గాని లేక జ్ఞాననిష్ఠ యందుగాని) యోగి కాజాలడు. (ఫల సంకల్ప త్యాగం ఈ రెండింటికీ సామాన్యమవడం చేత అతడే సన్న్యాసి. సంకల్పత్యాగం చేత చిత్తవిక్షేపం లేకపోవడం వల్ల అతడే యోగి కూడా అవుతున్నాడు.)