సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః ।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ॥ 13
ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః ।
మనస్సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః ॥ 14
సమమ్, కాయ శిర గ్రీవమ్, ధారయన్, అచలమ్, స్థిరః,
సంప్రేక్ష్య, నాసికాగ్రమ్, స్వమ్, దిశః, చ, అనవలోకయన్.
ప్రశాంతాత్మా, విగతభీః, బ్రహ్మచారివ్రతే, స్థితః,
మనః, సంయమ్య, మచ్చిత్తః, యుక్తః, ఆసీత, మత్పరః.
కాయ శిర గ్రీవమ్ = శరీరాన్ని, తలను, కంఠాన్ని; సమమ్ = సమానంగా; అచలమ్ = నిశ్చలంగా; ధారయన్ = నిలిపి; స్థిరః = స్థిరంగా; స్వమ్ = తన; నాసికాగ్రమ్ = ముక్కు కొనను; సంప్రేక్ష్య = చూస్తూ; దిశః చ = దిక్కులను; అనవలోకయన్ = చూడకుండా; ప్రశాంతాత్మా = ప్రశాంతచిత్తుడూ; విగతభీః = నిర్భయుడూ; బ్రహ్మచారివ్రతే స్థితః = బ్రహ్మచర్య వ్రతుడై; మనః = మనస్సును; సంయమ్య = నియమించి, మచ్చిత్తః = చిత్తాన్ని నాయందు నిలిపి; మత్పరః = నన్నొక్కణ్ణే భావిస్తూ; యుక్తః = సమాహితుడై; ఆసీత = ఉండాలి.
తా ॥ మేరుదండాన్ని, కంఠాన్ని, శిరస్సును సమానంగా స్థిరంగా నిలిపి; నిశ్చలంగా దిక్కులు చూడకుండా, నాసికాగ్రమున* దృష్టిని నిబద్ధమొనర్చి; ప్రశాంత చిత్తుడూ, భయరహితుడూ, బ్రహ్మచర్యవ్రతి* అయి, మనస్సును నియమించి నాయందు చిత్తం నిలిపి, నన్ను మాత్రమే భావిస్తూ సమాహితుడై ఉండాలి.