యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ।
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ॥ 5
యత్, సాంఖ్యైః, ప్రాప్యతే, స్థానమ్, తత్, యోగైః, అపి, గమ్యతే,
ఏకమ్, సాంఖ్యమ్, చ, యోగమ్, చ, యః, పశ్యతి, సః, పశ్యతి.
సాంఖ్యైః = జ్ఞాననిష్ఠులైన సన్న్యాసులచే; యత్ = ఏ; స్థానమ్ = స్థానం; ప్రాప్యతే = పొందబడుతోందో; యోగైః అపి = నిష్కామ కర్మయోగుల చేత కూడా; తత్ = ఆ స్థానమే; గమ్యతే = పొందబడుతోంది; యః = ఎవడు; సాంఖ్యం చ = జ్ఞానయోగాన్ని; యోగం చ = నిష్కామ కర్మయోగాన్ని; ఏకమ్ = ఒక్క మోక్షానికే కారణంగా; పశ్యతి = గుర్తిస్తాడో; సః = అతడు; పశ్యతి = యథార్థాన్ని గుర్తిస్తున్నాడు.
తా ॥ జ్ఞాననిష్ఠులైన సన్న్యాసులు ఏ స్థానాన్ని (మోక్షాన్ని) పొందుతున్నారో, నిష్కామకర్మ యోగులు కూడా ఆ స్థానాన్నే పొందుతారు. జ్ఞానయోగ ఫలమూ, కర్మయోగ ఫలమూ ఒకటే – అదే మోక్షం. దీనిని గుర్తించినవాడే యథార్థదర్శి.
వ్యాఖ్య:–
కిందటి శ్లోకంలో చెప్పిన విషయాన్నే ఇక్కడ మళ్ళీ స్పష్టంగా చెబుతున్నారు. జ్ఞానయోగం, కర్మయోగం – రెండూ ఒకే ఫలితాన్ని ఇస్తాయని తెలుసుకున్నవారే నిజమైన తెలివైనవారు. వారే సత్యాన్ని సరిగ్గా చూడగలిగినవారు.
జ్ఞానయోగం, కర్మయోగం ఒకటే అని తెలిసినవారే నిజమైన చూపు ఉన్నవారు. మిగిలిన వారికి కళ్లు ఉన్నా, వారు సత్యాన్ని చూడలేకపోతున్నారు కాబట్టి గుడ్డివారితో సమానమే. నిజాన్ని చూడగలగడమే కళ్లు ఉన్నందుకు సార్థకత. కాబట్టి అజ్ఞానంతో ఆలోచించకుండా, విశాలమైన మనసుతో ఆలోచించాలి. ఏ మార్గంలో వెళ్ళినా చివరికి వచ్చేది ‘మోక్షమే’ అని గట్టిగా నమ్మాలి. కర్మయోగం పాటించేవారు “మేము తక్కువ స్థాయి వాళ్ళం” అని బాధపడకూడదు. జ్ఞానయోగం పాటించేవారు “మేమే గొప్పవాళ్ళం” అని గర్వపడకూడదు. ఎవరి దారిలో వారు, సరైన పద్ధతిలో ధైర్యంగా ప్రయాణిస్తే గమ్యాన్ని చేరుకుంటారు. మన లక్ష్యం (పరమాత్మ) ఒక్కటే అయినప్పుడు, దాన్ని చేరుకునే పద్ధతులు వేరుగా కనిపించినా, అంతిమంగా అవి వేరు కావని గ్రహించడమే మనిషికి ఉండాల్సిన నిజమైన జ్ఞానం (ప్రజ్ఞ). మనం అమెరికా వెళ్ళాలనుకుంటే, తూర్పు దిశగా ప్రయాణించినా, పడమర దిశగా ప్రయాణించినా చివరికి అక్కడికే చేరుతాం కదా! అలాగే ఏ మార్గంలో వెళ్ళినా గమ్యం ఒక్కటే.