స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువోః ।
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ॥ 27
యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః ।
విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః ॥ 28
స్పర్శాన్, కృత్వా, బహిః, బాహ్యాన్, చక్షుః, చ, ఏవ, అంతరే, భ్రువోః,
ప్రాణ అపానౌ, సమౌ, కృత్వా, నాసా అభ్యంతర చారిణౌ.
యతేంద్రియ మనోబుద్ధిః, మునిః, మోక్షపరాయణః,
విగత ఇచ్ఛా భయక్రోధః, యః, సదా, ముక్తః, ఏవ, సః.
బాహ్యాన్ = బాహ్యములైన; స్పర్శాన్ = విషయసమూహాలను; బహిః కృత్వా = మనస్సు నుండి వెలువరించి; చక్షుః చ = దృష్టిని; భ్రువోః = కనుబొమల; అంతరే ఏవ = మధ్యనే; (స్థాపయిత్వా = నిలిపి) నాసా అభ్యంతర చారిణౌ = నాసికా మధ్యమున సంచరించే; ప్రాణ అపానౌ = ప్రాణవాయువును, అపానవాయువును; సమౌకృత్వా = సమానం చేసి, కుంభకంలో ఊర్ధ్వాధోగతి శూన్యములుగా చేసి; యతేంద్రియ మనో బుద్ధిః = ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని నియమించినవాడై; మోక్షపరాయణః = ముముక్షువై; విగత ఇచ్ఛా భయ క్రోధః = ఇచ్ఛ, భయం, కోపం లేనివాడై; యః = ఏ; మునిః = యోగి; (వెలయుచున్నాడో) సః = అతడు; సదా = సర్వదా; ముక్తః ఏవ = బంధం లేనివాడే.
తా ॥ బాహ్యవిషయాల నుండి మనస్సును వెలువరించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి* (అర్ధనిమీలితమొనర్చి) నాసికామధ్యమున సంచరించే ప్రాణాపానవాయువుల ఉర్ధ్వాధోగతిని కుంభకంలో సమానం చేసి; మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను నియమించి, ఇచ్ఛాభయక్రోధాలను వీడి, మోక్షమొక్కటే ప్రాప్యంగా ఎంచే యోగి సర్వదా (జీవద్దశలో ఉండగానే) బంధనిర్ముక్తుడు.