న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః ।
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ॥ 14
న, కర్తృత్వమ్, న, కర్మాణి, లోకస్య, సృజతి, ప్రభుః,
న, కర్మ ఫల సంయోగమ్, స్వభావః, తు, ప్రవర్తతే.
ప్రభుః = ఆత్మ (ఈశ్వరుడు) లోకస్య = జనులకు; కర్తృత్వమ్ = కర్తృత్వాన్ని; న సృజతి = కలిగించడు; కర్మాణి = రథ ప్రాసాదాది ఈప్సిత వస్తువులను; (న సృజతి = సృష్టింపడు) కర్మఫల సంయోగమ్ = కర్మఫల సంబంధాన్ని; (న సృజతి = సృజింపడు) తు = కాని; స్వభావః = అవిద్యా రూపమైన మాయయే; ప్రవర్తతే = ఇలా ప్రవర్తిల్లుతోంది.
తా ॥ ఆత్మ (ఈశ్వరుడు) మనుష్యుల కర్తృత్వాన్ని గాని, కర్మలను గాని, కర్మఫల ప్రాప్తిని గాని సృష్టించడం లేదు. కాని, అవిద్యారూపమైన మాయయే ఈ విధంగా ప్రవర్తిల్లుతోంది. అంటే, అవిద్య చేతనే కర్తృత్వాదికాలు ఆత్మయందు ఆరోపించబడుతున్నాయి. (గీత: 7–14, 13-22, 31 చూ:)