ఏవం పరంపరాప్రాప్తం ఇమం రాజర్షయో విదుః ।
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ॥ 2
ఏవమ్, పరంపరా ప్రాప్తమ్, ఇమమ్, రాజర్షయః, విదుః,
సః, కాలేన, ఇహ, మహతా, యోగః, నష్టః, పరంతప.
పరంతప = శత్రుతాపకుడవైన అర్జునా; ఏవమ్ = ఈ విధంగా; పరంపరా ప్రాప్తమ్ = పరంపరాక్రమంలో లభించిన; ఇమమ్ = ఈ కర్మయోగాన్ని; రాజర్షయః = రాజఋషులు; విదుః = ఎరుగుదురు; ఇహ = ఈ జగత్తులో; సః = ఆ; యోగః = యోగం; మహతా =దీర్ఘమైన; కాలేన =కాలక్రమంలో; నష్టః = ఖీలమయ్యింది.
తా ॥ పరంతపా! పరంపరా ప్రాప్తమైన ఈ యోగం రాజర్షులు ఎరుగుదురు. ఈ లోకంలో కాలక్రమంలో ఈ యోగం వినష్ట (సంప్రదాయ) మయ్యింది.
వ్యాఖ్య:–
“రాజర్షయః” – ఒక రాజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినప్పుడు అతన్ని ‘రాజర్షి’ అంటారు. అంటే రాజు లక్షణాలు, ఋషి లక్షణాలు రెండూ ఉన్నవారన్నమాట. పూర్వం చాలామంది రాజులు ఈ గొప్ప విద్యను నేర్చుకుని రాజర్షులుగా మారారు. ‘ఋషి’ అనేది ఒక బిరుదు లాంటిది. దాన్ని ఎవరైనా పొందవచ్చు. సామాన్య మానవుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరిగ్గా సాధన చేస్తే ‘మహర్షి’ కాగలడు. దీనికి ముఖ్యంగా చేయవలసినవి:
- ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం (నిష్కామ కర్మ).
- ఇంద్రియాలను జయించడం.
- మనసును అదుపులో ఉంచుకోవడం.
- కోరికలను వదిలేసి ఆత్మజ్ఞానాన్ని పొందడం.
పూర్వం ఎందరో రాజులు ఇలాగే ఆచరించి రాజర్షులు అయ్యారు.
ఎంతో బిజీగా, ఎన్నో బాధ్యతలతో, ఒత్తిళ్లతో ఉండే రాజులే దీన్ని సాధించగలిగినప్పుడు, ఇక సామాన్యుల విషయం వేరే చెప్పాలా? చాలామంది గృహస్తులు (సంసారులు) “మాకు కుటుంబ పనులు, ఉద్యోగాలు, వ్యవసాయ పనులు ఉన్నాయి. పూజలు, ధ్యానాలు చేయడానికి మాకు టైం లేదు. అవన్నీ కేవలం సన్యాసులకే సాధ్యం” అని సాకులు చెబుతుంటారు. కానీ ఆ మాటలో నిజం లేదని ఈ శ్లోకం నిరూపిస్తోంది. ఒక రాజుకు ఉండే పనుల కంటే గృహస్తులకు ఎక్కువ పనులు ఉండవు కదా! కాబట్టి, ఆ పూర్వకాలపు రాజుల్లాగే ఎవరైనా సరే బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక సాధన చేసి తరించవచ్చు. ఇక్కడ రాజుల గురించి చెప్పారు కదా అని, మిగిలినవారు తెలుసుకోలేదని అర్థం కాదు. ఆ కాలంలో ఈ విద్యను ఆచరించే వారిలో రాజులే ముఖ్యులుగా ఉండేవారు. అంతేకాకుండా అర్జునుడు కూడా రాజే కాబట్టి, “నీ పూర్వీకులు నడిచిన దారిలో నడవడంలో నీకు ఎలాంటి కష్టం ఉండదు, నువ్వు కూడా సాధించగలవు” అని ధైర్యం చెప్పడానికి కృష్ణుడు ఇలా చెప్పి ఉండవచ్చు.
శ్లోకంలో వాడిన ‘నష్టః’ అనే పదానికి “పూర్తిగా నాశనమైపోయింది” అని అర్థం చేసుకోకూడదు. కాలక్రమేణా కొన్ని అవాంతరాల వల్ల (ఉదాహరణకు పరశురాముడు క్షత్రియ రాజులను సంహరించడం వల్ల), రాజర్షులకు తెలిసిన ఈ బ్రహ్మవిద్య మరియు నిష్కామ కర్మయోగం యొక్క ప్రచారం లోకంలో తగ్గిపోయింది. అంటే అది ప్రజలకు అందడం తగ్గిందే తప్ప, ఆ విద్య మాయం కాలేదు. ఒకవేళ ఆ విద్య నిజంగానే నశించిపోయింది అనుకుంటే, ఇంతకుముందు శ్లోకంలోనే ఈ యోగాన్ని ‘అవ్యయం’ (నాశనం లేనిది) అని చెప్పారు కదా? ఆ మాటకు ఇది విరుద్ధం (Opposite) అవుతుంది. భగవంతుడు ఎలాగైతే శాశ్వతుడో, ఆయన సృష్టించిన ధర్మం కూడా ఎప్పటికీ శాశ్వతమైనదే. అది మరుగున పడవచ్చు కానీ నశించదు.