దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే ।
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ॥ 25
దైవమ్, ఏవ, అపరే, యజ్ఞమ్, యోగినః, పర్యుపాసతే,
బ్రహ్మాగ్నౌ, అపరే, యజ్ఞమ్, యజ్ఞేన, ఏవ, ఉపజుహ్వతి.
అపరే = ఇతరులైన; యోగినః = యోగులు; దైవమ్ = దేవతా సంబంధమైన; యజ్ఞమ్ ఏవ = యజ్ఞమునే; పర్యుపాసతే = అనుష్ఠిస్తున్నారు; అపరే = మరి కొందరు; బ్రహ్మాగ్నౌ = బ్రహ్మమనే అగ్నిలో; యజ్ఞేన ఏవ = జీవాత్మచేతనే; యజ్ఞమ్ = జీవాత్మను; ఉపజుహ్వతి = ఆహుతిని ఇస్తున్నారు.
తా ॥ కొందరు యోగులు (జ్యోతిష్టోమాది యాగాలను చేసి) దేవతా సంబంధమైన యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నారు. (ఇది కర్మయజ్ఞం) మరికొందరు, బ్రహ్మం అనే అగ్నిలో జీవాత్మ చేత జీవాత్మనే ఆహుతి ఇస్తున్నారు – అంటే, సోపాధికమైన జీవాత్మను నిరుపాధికమైన పరమాత్మగా దర్శిస్తున్నారు.* (ఇది జ్ఞానయజ్ఞం) (ద్వితీయ, తృతీయ విధాలైన యజ్ఞములు.)
వ్యాఖ్య:-
యజ్ఞం కోసం పని చేసేవారి కర్మలన్నీ పూర్తిగా నశించిపోతాయని 23వ శ్లోకంలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఆ యజ్ఞంలో ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ వివరిస్తున్నారు. ప్రధానంగా రెండు రకాలు:
- దైవయజ్ఞం: కొంతమంది దేవతలను పూజించడం, ఉపాసించడం, ధ్యానం చేయడం, దేవునికి సేవ లేదా ప్రార్థన చేయడం వంటివి చేస్తారు. వీరిని ‘కర్మయోగులు’ లేదా ‘భక్తియోగులు’ అని పిలవవచ్చు.
- బ్రహ్మయజ్ఞం: మరికొందరు జ్ఞానులు… ‘నేను (ఆత్మ), ఆ దేవుడు (బ్రహ్మం) ఒక్కటే’ అనే భావనతో తమ మనసును (జీవుడిని) ‘బ్రహ్మం’ అనే అగ్నిలో ఆహుతి ఇస్తారు (అర్పించేస్తారు).
- దీని అర్థం ఏంటంటే… అగ్ని తనలో వేసిన దేన్నైనా కాల్చేసి తనలో కలిపేసుకుంటుంది. అలాగే, ఈ కనిపించే ప్రపంచం అంతా బ్రహ్మంలో కలిసిపోతుంది.
- మనసు (లేదా జీవుడు) కూడా ఈ ప్రపంచంలో భాగమే కాబట్టి, దాన్ని కూడా ఆ బ్రహ్మాగ్నిలో వేసి లయం చేస్తారు. ఇదే బ్రహ్మయజ్ఞం.
- దీనిని ఆచరించేవారిని ‘జ్ఞానయోగులు’ అంటారు.
అగ్నిలో వేసిన వస్తువు అగ్నిరూపంగా మారిపోయినట్లే… బ్రహ్మంలో లీనమైన మనసు కూడా బ్రహ్మస్వరూపంగా మారిపోతుంది (భ్రమర కీటక న్యాయం ప్రకారం – పురుగు తుమ్మెదను ధ్యానిస్తూ తుమ్మెదగా మారినట్లు). ఇదే మోక్షం.
‘నేను ఎవరు’ అనే ఆత్మ విచారణ ద్వారా, ప్రాపంచిక విషయాలపై వైరాగ్యం (ఆసక్తి లేకపోవడం) ద్వారా… మనసులోని పాత వాసనలు, సంస్కారాలు తొలగిపోతాయి. అప్పుడు ఆ స్వచ్ఛమైన మనసు బ్రహ్మంలో కలిసిపోతుంది. దీన్నే బ్రహ్మయజ్ఞం అంటారు.