న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ।
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ॥ 14
న, మామ్, కర్మాణి, లింపంతి, న, మే, కర్మఫలే, స్పృహా,
ఇతి, మామ్, యః, అభిజానాతి, కర్మభిః, న, సః, బధ్యతే.
కర్మాణి = కర్మలు; మామ్ = నన్ను; న లింపంతి = స్పృశించవు; మే = నాకు; కర్మఫలే = కర్మఫలంపై; స్పృహా న = ఆసక్తి లేదు; ఇతి = ఈ విధంగా; యః = ఎవడు; మామ్ = నన్ను ఆత్మరూపంగా; అభిజానాతి = తెలుసుకుంటాడో; సః = అతడు; కర్మభిః = కర్మల చేత; న బధ్యతే = బంధింపబడదు.
తా ॥ దేహేంద్రియాదుల పట్ల నాకు మమకారం లేనందువల్ల నేను కర్మలయందు లిప్తుడవడం లేదు. ఆప్తకాముడనవడం చేత కర్మఫల తృష్ణ కూడా లేదు – ఈ విధంగా ఎవడు నన్ను అకర్త, అభోక్త అయిన ఆత్మరూపంగా గ్రహిస్తాడో* , అతడు కర్మల చేత ఎన్నడూ బంధించబడడు. కర్మ అతనికి జన్మాంతర బంధనము కాజాలదు.