యజ్ఞార్థాత్కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ॥ 9
యజ్ఞార్థాత్, కర్మణః, అన్యత్ర, లోకః, అయమ్, కర్మబంధనః,
తదర్థమ్, కర్మ, కౌంతేయ, ముక్తసంగః, సమాచర.
యజ్ఞార్థాత్ = ఈశ్వరుని కొరకు అనుష్ఠించబడే; కర్మణః = కర్మ కంటే; అన్యత్ర = అన్యమైన కర్మ వల్ల; అయమ్ = ఈ; లోకః = కర్మాధికారి అయినవాడు; కర్మబంధనః = కర్మచే బంధించ బడుతున్నాడు; కౌంతేయ = కుంతీపుత్రా; ముక్తసంగః = ఆసక్తి శూన్యుడవై; తదర్థమ్ = యజ్ఞార్థం, ఈశ్వరుని కొరకు; కర్మ = కర్మను; సమాచర = ఒనర్చు.
తా ॥ ఈశ్వర ప్రీత్యర్థం* అనుష్ఠించబడ్డ కర్మ కాకుండా, ఇతరమైన కర్మల చేత ఈ లోకం బంధించబడుతోంది. కనుక నీవు, భగవంతుణ్ణి ఉద్దేశించి అనాసక్తుడవై కర్మలను ఆచరించు.