అర్జున ఉవాచ :
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన ।
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ॥ 1
జ్యాయసీ, చేత్, కర్మణః, తే, మతా, బుద్ధిః, జనార్దన,
తత్, కిమ్, కర్మణి, ఘోరే, మామ్, నియోజయసి, కేశవ
అర్జునః = అర్జునుడు; ఉవాచ = పలికెను; జనార్దన = కృష్ణా; కర్మణః = కర్మ కంటే; బుద్ధిః = జ్ఞానం; జ్యాయాసీ = శ్రేష్ఠమని; తే = నీకు; మతా చేత్ = అభిమతమైన; కేశవ = కృష్ణ; తత్ కిమ్ = అప్పుడు ఎందుకు; మాం = నన్ను; ఘోరే = హింసాత్మకమైన; కర్మణి = కర్మలో; నియోజయసి = నియోగిస్తున్నావు?
తా ॥ [ద్వితీయాధ్యాయంలో భగవానుడు నివృత్తిమూలమైన జ్ఞాననిష్ఠను ప్రవృత్తిమూలమైన కర్మనిష్ఠను నిర్దేశించి ఉన్నాడు. ‘ప్రజహాతి యదా కామాన్’ (గీత. 2–55) అని ఆరంభించి ‘ఏషా బ్రాహ్మీ స్థితిః’ (గీత. 2–72) అనే శ్లోకం వరకు జ్ఞాననిష్ఠులకు జ్ఞానయోగం వల్లే పరమ పురుషార్థం లభిస్తుందని ఉపదేశించాడు. అయినప్పటికీ ‘కర్మాచరణంలోనే నీకు అధికారం, నీకు ‘అకర్మ’ లో ఆసక్తి కలుగకుండా ఉండు గాక’ (గీత. 2–47) అని అర్జునునికి కర్మనే కర్తవ్యంగా ఉపదేశించాడు, కాని కర్మ వల్ల శ్రేయ ప్రాప్తి కలుగుతుందని చెప్పలేదు. కాబట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్ఠం అని తలచి] అర్జునుడు ఇలా పలికాడు: జనార్దనా! కర్మ కంటే జ్ఞానమే శ్రేష్ఠమని నీ అభిప్రాయమైతే, నన్ను హింసాత్మకమైన ఈ కర్మను ఒనర్చడానికి ఎందుకు నియోగిస్తున్నావు?