అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥ 14
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ ।
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ॥ 15
అన్నాత్, భవంతి, భూతాని, పర్జన్యాత్, అన్న సంభవః,
యజ్ఞాత్, భవతి, పర్జన్యః, యజ్ఞః, కర్మ, సముద్భవః.
కర్మ, బ్రహ్మోద్భవమ్, విద్ధి, బ్రహ్మ, అక్షర సముద్భవమ్,
తస్మాత్, సర్వగతమ్, బ్రహ్మ, నిత్యమ్, యజ్ఞే, ప్రతిష్ఠితమ్.
అన్నాత్ = అన్నం నుండి; భూతాని = ప్రాణులశరీరాలు; భవంతి = ఉత్పన్నమవుతున్నాయి; పర్జన్యాత్ = వర్షం నుండి; అన్నసంభవః = అన్న సృష్టి; యజ్ఞాత్ = యజ్ఞం వల్ల కలిగే అపూర్వమనబడే అదృష్టఫలం నుండి; పర్జన్యః = వర్షం; భవతి = ఉత్పన్నమవుతోంది; యజ్ఞః = అపూర్వమైన ఈ కర్మఫలం; కర్మసముద్భవః = వైదికహోమాది క్రియల నుండి ఉత్పన్నమవుతోంది.
కర్మ = కర్మను; బ్రహ్మోద్భవమ్ = వేదం నుండి పుట్టినదిగా, వేద ప్రతిపాదితంగా; విద్ధి = గ్రహించు; బ్రహ్మ = వేదం; అక్షరసముద్భవమ్ = పరమాత్మ నుండి పుట్టినది; తస్మాత్ = కనుక; సర్వగతమ్ = సర్వప్రకాశకం; సర్వవ్యాపియైన; బ్రహ్మ = వేదం; నిత్యమ్ = సదా; యజ్ఞే = యజ్ఞంలో; ప్రతిష్ఠితమ్ = ప్రతిష్ఠితమైనది.
తా ॥ అన్నం నుండి ప్రాణుల శరీరం ఉత్పన్నమవుతోంది. అన్నం మేఘం నుండి కలుగుతోంది. మేఘం యజ్ఞం నుండి కలుగుతోంది, యజ్ఞం హోమాది కర్మల వల్ల ఉత్పన్నమవుతోంది.
తా ॥ కర్మ వేదాల నుండి కలుగుతోందని గ్రహించు. వేదం పరమాత్మ నుండి* సముద్భూతము. కనుక, సర్వప్రకాశము (సర్వవ్యాపి) అయిన వేదం సర్వదా యజ్ఞమందు ప్రతిష్ఠితమై ఉంది.