రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ।
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ॥ 64
రాగద్వేష వియుక్తైః, తు, విషయాన్, ఇంద్రియైః, చరన్,
ఆత్మవశ్యైః, విధేయాత్మా, ప్రసాదమ్, అధిగచ్ఛతి.
తు = కాని; రాగద్వేషవియుక్తైః = కోరిక, ఏవగింపు లేనివీ; ఆత్మవశ్యైః = తనకు లోబడినవీ అయిన; ఇంద్రియైః = ఇంద్రియాలతో; విషయాన్ = విషయాలను; చరన్ = భోగించువాడైనా; విధేయాత్మా = సంయుత చిత్తుడైన వ్యక్తి; ప్రసాదమ్ = నిర్మలత్వాన్ని; అధిగచ్ఛతి = పొందుతాడు.
తా ॥ సంయుతచిత్తుడైన పురుషుడు ప్రియవస్తువుల ఆసక్తి నుండీ, అప్రియ విషయాల ద్వేషం నుండీ విడివడతాడు. స్వాధీనమైన ఇంద్రియాల చేత జీవించడానికి అనివార్యాలైన విషయాలను గ్రహిస్తూ నిర్మలుడవుతున్నాడు. (పరమమైన శాంతిని పొందుతాడు).