గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమహీహ లోకే ।
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ॥ 5
గురూన్, అహత్వా, హి, మహానుభావాన్,
శ్రేయః, భోక్తుమ్, భైక్ష్యమ్, అపి, ఇహ, లోకే,
హత్వా, అర్థకామాన్, తు, గురూన్, ఇహ, ఏవ
భుంజీయ, భోగాన్, రుధిరప్రదిగ్ధాన్
హి = ఎందుకంటే; మహానుభావాన్ = మహానుభావులైన; గురూన్ = గురుజనులను; అహత్వా = వధింపకుండా; ఇహలోకే = ఈ లోకంలో; భైక్ష్యమపి = భిక్షాన్నమైనా; భోక్తుం = తినడం; శ్రేయః = మేలు; గురూన్ = గురుజనులను; హత్వా తు = చంపితే; రుధిరప్రధిగ్ధాన్ = రక్తసిక్తములైన; అర్థకామాన్ = ధనసంపదలను, కామ్యవస్తువులను; భోగాన్ = భోగ్యవిషయాలను; ఇహ ఏవ = ఈ జగత్తులోనే; భుంజీయ = అనుభవిస్తాను.
తా ॥ (వారిని వధించకపోతే, నీ బ్రతుకుతెరువేమిటి? అంటావా:) మహానుభావులైన గురుజనులను వధించకుండా, భిక్షాన్న గ్రహణమొనర్చి జీవించినా, నాకు మేలే అవుతుంది కాని, వారిని చంపితే, వారి నెత్తురుతో తడిసిన ధనసంపదలను, కామ్యభోగాలను కదా అనుభవిస్తాను.