శ్రీ భగవానువాచ :
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ॥ 55
ప్రజహాతి, యదా, కామాన్, సర్వాన్, పార్థ, మనోగతాన్,
ఆత్మని, ఏవ, ఆత్మనా, తుష్టః, స్థిత ప్రజ్ఞః, తదా, ఉచ్యతే.
శ్రీభగవాన్ = శ్రీకృష్ణుడు; ఉవాచ = పలికెను; పార్థ = అర్జునా; ఆత్మని ఏవ = ఆత్మయందే; ఆత్మనా = ఆత్మచేత; తుష్టః = తృప్తుడై; యదా = ఎప్పుడైతే; మనోగతాన్ = మనస్సులోని; కామాన్ = కోర్కెలను; సర్వాన్ = అన్నింటిని; ప్రజహాతి = విడుచునో; తదా = అప్పుడు; (యోగి) స్థితప్రజ్ఞః = స్థితప్రజ్ఞుడని; ఉచ్యతే = చెప్పబడును.
తా ॥ శ్రీభగవానుడు పలికెను: పార్థా! ఆత్మచేత ఆత్మయందే తృప్తుడై మనస్సులోని* కోర్కెలనన్నింటినీ సంపూర్ణంగా త్యజించిన యోగి స్థితప్రజ్ఞుడనబడును.
వ్యాఖ్య:-
చాలామంది తమ గురువుల దగ్గరికి వెళ్లి, ‘స్వామీ! మాకు మోక్షం ఎప్పుడు వస్తుంది? మాకు ఈ సంసార బాధలు ఎప్పుడు పోతాయి?’ అని అడుగుతుంటారు. దానికి ఆ గురువులు, ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పిన సమాధానాన్నే చెబుతున్నారు. అదేంటంటే… మోక్షం రావడానికి మంచి ముహూర్తం వేరే ఎక్కడో లేదు, అది ఎవరి చేతుల్లో వాళ్ళకే ఉంది. ఇక్కడ విషయం చాలా సూటిగా చెప్పారు: ‘యదా (ఎప్పుడు) నువ్వు సాధన చేస్తావో… తదా (అప్పుడే) నీకు మోక్షం వస్తుంది.’ ఈ శ్లోకంలో చెప్పిన అర్హత మనిషికి ఏ క్షణంలో వస్తుందో, ఆ క్షణంలోనే అతనికి ముక్తి అరచేతిలో ఉసిరికాయలా (కరతలామలకం) చాలా సులభంగా దొరుకుతుంది. కాబట్టి, ‘నాకింకా శాంతి దొరకలేదు, నా దుఃఖం పోలేదు’ అని పెద్దలనో, శాస్త్రాలనో విమర్శించి లాభం లేదు. ముందు తాను చేయాల్సిన సాధనను తాను సరిగ్గా చేయాలి.
(1) ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ – మొట్టమొదట మనలో ఉన్న కోరికలన్నింటినీ పూర్తిగా వదిలేయాలి. ఇక్కడ భగవంతుడు కేవలం ‘వదిలేయడం’ (జహాతి) అనే పదాన్ని వాడలేదు. ‘పూర్తిగా వదిలేయడం’ (ప్రజహాతి) అనే పదాన్ని వాడారు. అంటే కోరికలను వేర్లతో సహా పీకేయాలని అర్థం. అలాగే ‘అన్నింటినీ’ (సర్వాన్) అనడం వల్ల, ఒక్కటి కూడా మిగల్చకుండా సమస్త కోరికలను వదిలేయాలని స్పష్టంగా తెలుస్తోంది.
ఎందుకంటే కొన్ని ప్రమాదకరమైన విషయాలు కొంచెం మిగిలి ఉన్నా కూడా మళ్ళీ పెరిగి పెద్ద ప్రమాదాన్ని తెస్తాయి. అవి: పాత అలవాట్లు (వాసనలు), నిప్పు, అప్పు, రోగం, శత్రువు, పగ, విషం. ఇవి ఏ కొంచెం మిగిలి ఉన్నా ప్రమాదమే. అందుకే వీటిని పూర్తిగా తొలగించుకోవాలని శాస్త్రాలు గట్టిగా చెబుతున్నాయి. అన్ని కోరికలను సగం సగం వదిలేసినా లాభం లేదు, లేదా కొన్ని కోరికలను మాత్రం పూర్తిగా వదిలేసి మిగతావి ఉంచుకున్నా ప్రయోజనం ఉండదు. అన్నింటినీ, పూర్తిగా వదిలేసినప్పుడు మాత్రమే మనం కోరుకునే ‘మోక్షం’ దొరుకుతుంది. ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికే కృష్ణుడు ఇక్కడ ‘ప్రజహాతి’ (పూర్తిగా వదులు), ‘సర్వాన్’ (అన్నింటినీ) అనే రెండు బలమైన పదాలను వాడారు.
కోరికలు మన మనసులోని మూలల్లో ఎక్కడో దాక్కుని ఉంటాయి. అవి ‘వాసనల’ (పాత అలవాట్లు లేదా సంస్కారాల) రూపంలో లోపల గట్టిగా పాతుకుపోయి ఉంటాయి. అందుకే భగవద్గీతలో వాటిని ‘మనోగతాన్’ (మనసులో ఉన్నవి) అని అన్నారు. దోషం గానీ, బంధం గానీ బయట ఎక్కడో లేవు; అన్నీ మన మనసులోనే ఉన్నాయి. మనసు అనేది ఒక చీకటి గుహ లాంటిది. అందులో ‘వివేకం’ అనే దీపాన్ని వెలిగించి, ఏయే కోరికలు ఎక్కడ దాక్కున్నాయో వెతికి మరీ వాటిని ఏరి పారేయాలి. ఉదాహరణకు అన్నంలో రాళ్లను, తోటలో కలుపు మొక్కలను, పులదండలో ముళ్లను, పంటలో చీడపురుగులను…మనం ఎలా అయితే ఏరి దూరంగా పారేస్తామో, అలాగే మనసులోని కోరికలన్నింటినీ పూర్తిగా తీసిపారేయాలని భగవంతుడు ఇక్కడ చెబుతున్నారు. ఈ కోరికలు ఎన్నో జన్మల నుంచి మనల్ని వెంటాడుతూ, మన లోపల (కారణ శరీరంలో) గట్టిగా వేళ్ళూనుకుని ఉన్నాయి. మనకు మళ్ళీ మళ్ళీ చావు పుట్టుకలు రావడానికి కారణం ఇవే. కాబట్టి వాటిని వేర్లతో సహా పెకలించి దూరంగా విసిరేయాలి. ఏ ఒక్క చిన్న కోరిక మిగిలి ఉన్నా ప్రమాదమే. ఎందుకంటే, కొంతమంది దాదాపు అన్ని కోరికలు వదిలేస్తారు కానీ, చివరికి ఏదో ఒక్కదాని మీద మమకారం పెంచుకుంటారు. దానివల్ల మెల్లగా మళ్ళీ పాత బంధాల్లో చిక్కుకుపోతారు. నిప్పు మొత్తం ఆరిపోయినా, ఒక్క చిన్న నిప్పురవ్వ మిగిలి ఉంటే చాలు… కాలక్రమేణా అది మళ్ళీ పెద్ద మంటగా మారి భయంకరమైన నష్టాన్ని కలిగిస్తుంది కదా! అందుకే భగవంతుడు ఇక్కడ ‘అన్ని కోరికలను పూర్తిగా వదిలేయాలి’ అనే విషయాన్ని అంత గట్టిగా చెప్పారు. ఇలా వదిలేయడానికి మనకు ఆత్మవిచారణ, వివేకం, వైరాగ్యం సహాయపడతాయి.
(2)‘ఆత్మన్యేవాత్మనాతుష్టః’ అంటే తన ఆత్మలోనే తాను ఆనందంగా, తృప్తిగా ఉండటం. అసలు ఆనందం, తృప్తి ఎక్కడ దొరుకుతాయి? అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఆనందం బయట ఎక్కడా లేదు. కళ్ళకు కనిపించే దృశ్యాల్లో లేదు. మనం వినే, తాకే విషయాల్లోనూ లేదు. భూమి, ఆకాశం మొత్తం వెతికినా, పద్నాలుగు లోకాలను అంగుళం అంగుళం కాగడా పెట్టి వెతికినా సరే, ఆనందం బయట దొరకదు. ఎందుకంటే ఆనందం అనేది బయట దొరికే వస్తువు కాదు. అది మనలోనే (మన ఆత్మలోనే) దొరుకుతుంది.
ఆనందం ఎలా బయటపడుతుంది? ఎప్పుడైతే మనసులో ఉన్న కోరికలు అనే మురికి పోతుందో, అప్పుడు సహజంగానే మనలో ఉన్న ఆత్మానందం బయటపడుతుంది. వేదాంత సారం (సీక్రెట్) అంతా ఇక్కడే ఉంది. బ్రహ్మానందం అనేది మనం కొత్తగా తయారుచేసుకునేది కాదు. ఆ ఆనందం మనలో ఎప్పుడూ ఉంటుంది. కానీ అజ్ఞానం వల్ల అది కప్పబడి ఉంది. వివేకం, వైరాగ్యంతో మన మనసుకి పట్టిన ‘కోరికలు’ అనే బూజును ఎప్పుడైతే దులుపుతామో, అప్పుడు లోపల ఉన్న నిజమైన ఆనందం బయటపడుతుంది.
ఉదాహరణకు:
- నీటి మీద పాచిని పక్కకు జరిపితే స్వచ్ఛమైన నీరు కనిపించినట్లు,
- అద్దం మీద దుమ్ము తుడిస్తే అద్దం స్వచ్ఛంగా మెరిసినట్లు…
మనసులోని దోషాలు, పాత అలవాట్లు, కోరికలు పూర్తిగా పోతే… స్వయం ప్రకాశకుడైన దేవుడు (పరమాత్మ) మనలో కనిపిస్తాడు. అందుకే భగవంతుడు ఈ శ్లోకంలో: మొదటి లైన్లో ‘కోరికలు వదిలేయాలి’ అనే సాధనను చెప్పి, రెండో లైన్లో దాని వల్ల వచ్చే ‘ఆత్మానందం’ అనే ఫలితాన్ని చెప్పారు. సాధన చేస్తేనే ఫలితం వస్తుందని దీని అర్థం.
ఈ విధంగా కోరికలన్నింటినీ పూర్తిగా వదిలేసి, ఎప్పుడూ తన ఆత్మలోనే తృప్తిని పొందేవాడినే ‘స్థితప్రజ్ఞుడు’, ‘జీవన్ముక్తుడు’, ‘జ్ఞాని’ అని అంటారు. ఒక మనిషి పరిపూర్ణమైన స్థితికి చేరుకున్నాడా లేదా అనేది ఈ గుర్తులను బట్టి మనం సులభంగా తెలుసుకోవచ్చు:
- జీవన్ముక్తుడి ముఖం: ఎప్పుడూ తృప్తి, ఆనందం తాండవిస్తూ (వెల్లివిరుస్తూ) ఉంటాయి.
- కోరికలు ఉన్నవాడి ముఖం: ఎప్పుడూ దిగులు, దుఃఖం మొహాన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి.
స్థితప్రజ్ఞుడికి ఇక బయట నుండి పొందాల్సిన వస్తువు ఏదీ ఉండదు. అందుకే అతను తన హృదయంలోనే ‘బ్రహ్మానందం’ అనే అమృత సముద్రంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఇదే ఆ మహనీయుడిని గుర్తించడానికి అసలైన గుర్తు.
నిజమైన పండితుడు గొప్పలు చెప్పడు (భాగవత పండితుడు – జ్ఞాని అయిన రాజు)
ఒక పండితుడు ఒక రాజు దగ్గరకు వెళ్ళాడు. రాజుతో ఆ పండితుడు, “ఓ రాజా! నేను శాస్త్ర గ్రంథాలను క్షుణ్ణంగా చదివాను. మీకు భాగవతం బోధించాలనుకుంటున్నాను. అనుమతించండి!” అని అడిగాడు. వారిద్దరిలోకీ ఆ రాజే తెలివిగలవాడు. నిజంగా భాగవతాన్ని చదివినవాడు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు కానీ డబ్బు కోసం, పేరుప్రతిష్ఠల కోసం రాజుల చుట్టూ, ఆస్థానాల చుట్టూ తిరగడని ఆయనకు తెలుసు. రాజు ఆ పండితుడితో, “స్వామీ! మిమ్మల్ని నా గురువుగా స్వీకరించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ చూడబోతే మీరే ఆ గ్రంథాన్ని సరిగ్గా చదివినట్టు లేదు. కాబట్టి ముందు మీరు దానిని బాగా చదువుకొని రండి!” అన్నాడు. ఆ పండితుడు తిరిగి వెళుతూ, “ఈ రాజు ఎంత తెలివితక్కువ వాడు! ఇన్ని ఏళ్ళుగా భాగవతాన్ని మథిస్తున్నాను! అయినా నన్నే ముందు సరిగ్గా చదవమంటున్నాడు!” అనుకున్నాడు. ఆ పండితుడు ఆ గ్రంథాన్ని మరొకసారి శ్రద్ధగా చదివి తిరిగి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు మళ్ళీ అదే సమాధానం చెప్పి పంపించేశాడు.
ఆ పండితుడికి చాలా విసుగు కలిగింది. కానీ రాజుగారి ప్రవర్తన వెనుక ఏదోవొక గూఢార్థం ఉండి ఉంటుందని అతనికి తోచింది. అతడు ఇంటికి తిరిగివెళ్ళి తన గది తలుపులు మూసుకొని, లోపల కూర్చుని శ్రద్ధగా భాగవతాన్ని చదవసాగాడు. క్రమక్రమంగా అతనికి ఆ గ్రంథంలో ఇమిడి ఉన్న భావాలు అర్థమయ్యాయి. నీటిబుడగలవంటి సిరిసంపదలు, పేరు ప్రతిష్ఠలు, రాజాస్థానాలు మొదలైన వాటికోసం ప్రాకులాడడం ఎంత నిరర్థకమో అర్థమయింది. అప్పటి నుండి భగవంతుని మీద పరిపూర్ణమైన భక్తి సాధించాలని అనుకున్నాడు. రాజుగారి దగ్గరకు పోవాలన్న ఆలోచనను పూర్తిగా విడిచిపెట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని అతడి ఇంటికి వెళ్ళాడు. ఆ పండితుడి ముఖం దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నది. రాజు అతని పాదాలకు నమస్కరించి, ‘స్వామీ! మీరు ఇప్పుడు శాస్త్రాలలోని సత్యాలను అనుభూతి చెందినట్టు నాకు కనిపిస్తోంది. దయచేసి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి!’ అని ప్రార్థించాడు.