కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ॥ 47
కర్మణి, ఏవ, అధికారః, తే, మా, ఫలేషు, కదాచన
మా, కర్మఫల హేతుః, భూః, మా, తే, సంగః, అస్తు, అకర్మణి
కర్మణి ఏవ = కర్మాచరణలోనే; తే = నీకు; అధికారః = అధికారం; కదాచన = ఎన్నడూ; ఫలేషు = కర్మ ఫలాల; అధికారః = కోరిక; మా = కలుగకుండు గాక; కర్మఫలహేతుః = కర్మఫలాల కారణం; మా భూః = కావద్దు; అకర్మణి = కర్మత్యాగంలో; తే = నీకు; సంగః = ఆసక్తి; మా అస్తు = కలుగకుండు గాక.
తా ॥ (ఈశ్వరారాధన వల్లే కర్మఫలసిద్ధి లభిస్తుండగా, కర్మలను త్యజించి ఈశ్వరారాధన మాత్రమే ఎందుకు చేయకూడదు? అని అంటావా: తత్త్వజ్ఞానార్థివైన) నీకు కర్మాచరణలోనే అధికారముంది. ఎన్నడూ కూడా నీకు కర్మఫలాలపై ఆసక్తి కలుగకుండా ఉండుగాక. కర్మఫల తృష్ణయే కర్మఫలాలను ఉత్పన్నం చేస్తోంది. కనుక కర్మఫలప్రాప్తికి కారణం కావద్దు. అంటే, కర్మలను సకాముడవై ఆచరించ వద్దు. కర్మత్యాగంపై కూడా నీకు ఆసక్తి కలుగకుండు గాక.(గీత: 18–7, 9)