క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే ।
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ॥ 3
క్లైబ్యమ్, మా, స్మ, గమః, పార్థ, న, ఏతత్, త్వయి, ఉపపద్యతే,
క్షుద్రమ్, హృదయదౌర్బల్యమ్, త్యక్త్వా, ఉత్తిష్ఠ, పరంతప.
పార్థ = అర్జునా; క్లైబ్యం = భీతిని; మాస్మ గమః = పొందకు; ఏతత్ = ఇది; త్వయి = నీకు; న ఉపపద్యతే = తగదు; పరంతప = శత్రుతాపనా; క్షుద్రమ్ = తుచ్ఛమైన; హృదయ దౌర్బల్యమ్ = మనస్సులో అధైర్యాన్ని; త్యక్త్వా = విడిచి; ఉత్తిష్ఠ = లెమ్ము.
తా ॥ అర్జునా! భయమును పొందకు. ఇది నీకు తగదు. శత్రుతాపనా, తుచ్ఛమైన ఈ హృదయదౌర్బల్యాన్ని త్యజించి, యుద్ధం చేయడానికి సంసిద్ధుడవు కమ్ము, లెమ్ము!
మహాభారతం, ఉపనిషత్తులు, భాగవతం అన్నీ సనాతన ధర్మాన్నే మరొక విధమైన మాటతో ‘అజాత శత్రువు’ అని చెప్పాయి. శత్రువే లేడు. శత్రువు అంటూ ఒకడు ఉంటేనే కదా! అబద్ధం చెప్పడం, తప్పించుకోవడం జరుగుతుంది. అసలు శత్రువే లేకుంటే, శత్రువుని ఎలా గుర్తించడం? అదే ఉన్నతమైన స్థితి. ‘అజాత శత్రువు’ అంటే అతనికి శత్రువు పుట్టనేలేదని. చాలా కొద్దిమంది మాత్రమే ఈ ఉన్నతస్థితిలో ఉండగలరు. ఇదే ఉన్నతస్థితి అయితే మనమందరం దానిని అందుకోవడానికే ప్రయత్నం చెయ్యాలి. అందరితో ప్రేమగా, సహాయకారిగా, దయగా ఉండడం నేర్చుకోవాలి. సాధారణంగా ఒక అల్ప స్థితి నుంచి ఉన్నతమైన పరిణామాన్ని చేరుకోవడానికి కావలసిన సమాజాన్ని నిర్మించుకోవటమే మానవ అభ్యున్నతికి మార్గం. అయితే ఆ ప్రయత్నంలో ఈ ప్రపంచంలోని ఎన్నో ఒడుదుడుకులను, అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది.
చెడును అడ్డుకోవాలి. అడ్డుకోలేనట్లైతే మనకు అభివృద్ది ఉండదు, సమాజానికీ అభివృద్ధి ఉండదు. చెడును నిరోధించకపోతే అది విపరీతంగా పెరిగిపోతుంది. సన్న్యాసికి చెప్పేబోధకి, గృహస్థుడికి చెప్పే బోధకి వ్యత్యాసముంది. గృహస్థుడు ఇంట్లో దొంగలు పడి పారిపోతుంటే, వారి వెనుక వెళ్ళి మరికొన్ని సామాన్లను తీసుకొని వెళ్ళమని దొంగలకు ఇవ్వలేడు. అలా చేస్తే తనమీద ఆధారపడి ఉన్న కుటుంబం బాధపడుతుంది. పూర్వం కొంతమంది సాధువులు ఆ విధంగా చెయ్యడం జరిగింది. పవహారీ బాబా, (ఘాజీపూర్ నివాసి) ఆ విధంగా చేశాడు. ఆయన దొంగను, అయ్యో! నీవు ఇవి మర్చిపోయావు. వీటిని కూడా తీసుకువెళ్ళమని, దొంగ వెంట పరుగెత్తుకొని వెళ్ళి ఇస్తాడు. అది మంచిదే కావచ్చు, కానీ సామాన్య పౌరుడు ఆ విధంగా చెయ్యలేడు. తనకు ఉన్నదాన్ని అతను కాపాడుకోవాలి. గృహస్థుడు శాంతి మార్గంలోకాకుంటే, దౌర్జన్యంగా అయినా సరే తనను తాను రక్షించుకోవాలి. మహాత్మాగాంధి శాంతిమార్గాన్నే చాలావరకూ ఉపయోగించాడు. ఉత్తరప్రదేశ్‌లో బారియా అనే గ్రామాన్ని సత్యాగ్రహం రోజుల్లో పోలీసులు ధ్వంసం చేశారు. వారు చాలా నాశనం చేశారు. వారు గ్రామాల్లో ఆడవారిని అవమానపరిచారు. గ్రామీణులు ఎవ్వరూ ఆ దురాగతాన్ని అడ్డుకోలేదు. ఆ తర్వాత గాంధీజీ ఏం జరిగిందో విచారించటానికి వెళ్లినప్పుుడు, వారంతా గాంధీజీ శాంతియుతంగా ఉండమన్నారని వారు ఆ దురాగతాలను ఎదుర్కోలేదన్నారు. అది విన్న గాంధీజీ ‘మీరంతా ఇలా చెప్పడం నాకు సిగ్గుగా ఉంది అన్నారు. మీ ఆడవారి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? శాంతిమార్గం పేరుతో మీరంతా పిరికిపందలుగా ప్రవర్తించారు. నేను పిరికిపందల శాంతిమార్గాన్ని నేర్పలేదు. నేను ధైర్యశాలుర శాంతి మార్గాన్ని మాత్రమే చెప్పాను’ అన్నారు. గాంధీజీ తన జీవితంలో ఆ సంఘటనను చాలా పెద్ద అనుభవంగా తీసుకున్నారు. ….
శ్రీరామకృష్ణులు ఒక నీతికథ ద్వారా చక్కటి పాఠాన్ని తెలియజేస్తారు. ఒక అడవిలో విషసర్పం ఒకటి ఉంది. పిల్లలు ఆ దగ్గర్లో ఆడుకుంటుండేవారు. పాము ఉన్నవైపుకి వెళ్ళాలంటే వారు చాలా భయపడుతుండే వారు. ఒకరోజు ఒక సాధువు ఆ మార్గంలో వెళ్తున్నాడు. అప్పుడు పిల్లలందరూ ‘ఆ ప్రక్కకు వెళ్ళవద్దు, వెళ్ళవద్దు. అక్కడ విషసర్పముందని’ అరుస్తారు. ‘విష సర్పం నన్నేమీచేయదు’ అని ఆయన అటువైపు వెళ్తాడు. ఆ సర్పం చరచరా అతని వైపు వస్తుంటే, ఆ సాధువు ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తాడు. అప్పుడు పాము చాలా సౌమ్యంగా మారిపోతుంది. తర్వాత సాధువుకు, పాముకు మధ్య సంభాషణ జరుగుతుంది.
‘నీవు ఎందుకు ఇతరులకు కీడు చేస్తున్నావు? ఇతరులకు కీడు చెయ్యడం కాదు, నీకు నీవు శాంతిగా ఉండు. ఇతరులను వారి మార్గంలో ఉండనివ్వు’ అని దానికి సాధువు ఒక మంత్రం చెప్పాడు. నేను నీకిచ్చిన మంత్రంతో జీవితంలో నీవు చాలా ఉన్నతికి చేరుకుంటావు. ఇక నుంచి ఎవరికీ కీడు చెయ్యవద్దు’ అని చెప్పి, నేను మరల వస్తానని ఆయన వెళ్ళిపోతాడు.
ఆ రోజు నుంచి ఆ సర్పం చాలా సౌమ్యంగా, క్రోధం లేకుండా, శాంతంగా ఉంటూ, తన ప్రవర్తనను మార్చుకుంది. దూరం నుంచి పిల్లలు అదంతా గమనిస్తున్నారు. ఆ పాము ఇదివరకు లాగా లేదని మెల్లమెల్లగా దాని దగ్గరకు వెళ్తుంటే అది ఏమీ చెయ్యకపోవడం గమనించి, ఎందువల్ల, ఆ మార్పు జరిగిందో వారికి తెలియకున్నా, దానివల్ల ఏమి అపాయం లేదన్న సంగతి గ్రహించారు. పిల్లలు ఒక రోజు దాని దగ్గరకు వెళ్ళి దానితోక పట్టుకొని గుండ్రంగా తిప్పి గట్టిగా తలను నేలకు వేసి కొట్టారు. అప్పుడు అది సగం చచ్చింది. చీకటి పడ్డాక దాని బొరియ లోనికి మెల్లగా దూరింది. పిల్లల భయంతో అది బయటికి రాలేక, ఆహారం లేక కొన్ని రోజులకి అది కేవలం ఎముకలగూడుగా తయారైంది.
కొన్ని రోజులు గడిచాక ఆ సాధువు తిరిగి వచ్చాడు. ఆ పాము చచ్చిపోయిందని చెప్పి పిల్లలు ఆయనను అటు వెళ్ళవద్దన్నారు. అలా ఏమీ జరగదు. నేను దానికి మంత్రోపదేశం చేశాను. జీవితపు అర్థం తెలుసుకోకుండా అది చనిపోదు అని ఆ పాము బొరియ దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పిన మంత్రంతో దాన్ని పిలుస్తాడు. పాము చాలా మెల్లగా బొరయ నుంచి బయటకు వచ్చింది. ఏమయింది నీకు? ఈ విధంగా చిక్కి పోయావు? అని ప్రశ్నించాడు. ఎవరికీ కీడు చెయ్యవద్దు అని మీరు చెప్పారు కదా! అందుకని క్రిమికీటకాలను కూడా తినకుండా, ఆకులు అలములను మాత్రమే తిని బ్రతుకుతున్నానని, అందువల్లనే అలా ఉన్నాను అని చెబుతుంది. సాత్త్వికమైన మార్పు దానిలో రావడంతో అది పిల్లలు కొట్టిన సంగతి కూడా మరచిపోయింది. ఎంత పిచ్చిదానివి? కేవలం ఆకులు తినడంవల్ల ఇలా జరిగి ఉండదు. ‘బాగా గుర్తుచేసుకో ఇంకేమైనా కారణం అయి వుండవచ్చు’, అన్నప్పుడు, అవును మర్చిపోయాను, పిల్లలు నన్ను నేలకు వేసి కొట్టారు, అని చెప్పింది. నేను శాంతంగా ఉన్నానని వారు గమనించి, ఎంతో ధైర్యంతో నన్ను కొట్టగా రక్తం కక్కుకొని, ఎలాగో బొరియలోకి దూరగలిగానని చెప్పింది. నా స్థితికి బహుశా అదే కారణమయి ఉండవచ్చు. ఎవ్వరికీ కీడు చెయ్యవద్దు అని చెప్పారు కదా! అందువల్ల నేనెవ్వరికీ కీడు చెయ్యలేదు. అయినా నాకు ఫర్వాలేదు అంది పాము. అప్పుడు సాధువు ‘ఎంత తెలివితక్కువదానివి? నేను ఎవ్వరికీ కీడు చెయ్యవద్దు అని మాత్రమే చెప్పాను. నీవు బుసకొట్టినట్లయితే వారు భయపడి ఉండేవారు కదా!’ అన్నాడు. ఈ సమాజంలో బుస కొట్టడం నేర్చుకోవాలి, లేకుంటే నీ సౌమ్యతను ఆసరాగా తీసుకొని నీకే కీడు తలపెడుతుంది ఈ ప్రపంచం. అందువల్ల బుసకొట్టమన్నాను కానీ, విషం కక్కమనలేదు, ఎవ్వరినీ కాటువేయమని చెప్పలేదు. ఈ కథ సందేశ మేమంటే మన అసమర్థతద్వారా సమాజంలో చెడుని మనం మరింతగా పెంచగూడదు అన్నదే.
చెడుని అడ్డుకోకపోవటమంటే చెడుని మరింత పెంచటమే. మనకు శాంతి కావాలి, నిజమే. మనకు నీతి నైతికతలు కూడా కావాలి. సామరస్యభావం కావాలి. కానీ నైతికంగా పూర్తిగా ఎదగని ఈ ప్రపంచంలో తప్పక మనం చెడును అడ్డుకోవలిసిందే; అందరూ సన్న్యాసులు కాలేరు. తోటి మానవుడి ప్రయాజనాలకు నష్టం వాటిల్లకుండా నిన్ను నీవు రక్షించుకోవాలి. ఇతరుల కోర్కెలను పరిరక్షించాలి. దేశాన్ని, దేశలక్ష్యాన్ని కాపాడాలి. ఈ లక్ష్యాన్ని అనుసరించడం కష్టమే కానీ, ప్రతి ఒక్కరూ తమ శక్తికొలదీ ప్రయత్నం చెయ్యాలి. ‘ఇదే ఉన్నతమైన ఆదర్శం’ మనం ఎంత ఆచరించగలిగితే అంత ఆచరించాలని గీతాచార్యుడి బోధ.
‘స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్’ కొద్దిపాటి ధర్మానుష్ఠానం కూడా, గొప్ప భయాన్నుంచి కాపాడుతుందని ముందు శ్లోకాల్లో భగవానుడు చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి చాలా ఎక్కువ వ్యవధి తీసుకొని దీనిని విశదంగా వివరించాక, బలహీనత ఎప్పుడూ నైతికత అవ్వదు అని అంటాడు. అర్జునుడు నేనీ యుద్ధాన్ని చెయ్యలేను అని చెప్పినప్పుడు; కాదు, ఇలాంటి బలహీనత ఎన్నటికీ వీరత్వం అనిపించుకోదు అని తెలియజేస్తాడు. నీ శరీరంలోని ప్రతి అణువు యుద్ధంలో పాలు పంచుకోవలసిందే అని, ‘నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలహీనత?’ అని ప్రశ్నిస్తాడు. గాంధీజీ కూడా మనకు దీనినే చెప్పారు. భగవద్గీత మొదటి భాగమంతా వ్యక్తి యొక్క పెరుగుదలను, అతనిలోని గొప్ప గుణాలను చెబుతూ, మానవునికి వీరత్వం ఉండాలని ప్రబోధిస్తుంది. చివరి భాగానికి వచ్చేటప్పటికి మానవుడు చేరుకోవలసిన ఉన్నతమైన స్థితిని తెలుపుతూ అంతా భగవంతునికే అర్పితం గావించమని వ్యక్తం చేస్తుంది. ఇది అంతా భగవంతుడికి చెందినది. మనందరం కేవలం ఆయనచేతిలో పరికరాలం మాత్రమే అంటారు. అంటే పూర్తి శరణాగతి భావన. అందరూ శరణాగతులు కాలేరు. దానికి ఎంతో బలం కావాలి.
కొంతమంది నేను త్యాగమయ జీవితాన్ని గడుపుతాను అని వస్తారు ‘ఏమి త్యాగం చేస్తావు? నీ దగ్గర త్యాగం చెయ్యడానికి ఏమీ లేదు. నీకు డబ్బుకానీ తెలివి కానీ ఏమీ లేవు. త్యాగం చెయ్యడానికి ఏమయినా పెంపొందించుకో! కష్టించి పనిచేసి డబ్బు సంపాదించు. గొప్ప వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని ఇతరుల విశ్వాసాన్ని పొందు,’ అని చెప్తాను. దానికి ఎంతో బలం కావాలి. విద్యను నేర్చుకోవడంలో ఇది మానవునికి మొదటి దశ. గీతలో తర్వాత భాగంలో దీని ప్రస్తావన వస్తుంది. డబ్బు సంపాదించడానికి చాలా బలం కావాలి. సంపాదించిన డబ్బును దానం చెయ్యడానికి మరింత బలం కావాలి. అది నిజమే కదా! ‘నాకు కావలసింది ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా నీకు సంబంధించిందే’ అని చెబుతూ, తనను తాను పూర్తిగా దైవానికి అంకితం చేసుకోవడానికి గొప్ప శక్తి కావాలి. అదే దివ్యమైన శక్తిగా చెప్పవచ్చు. ఈ స్థితికి ఎంతమంది చేరుకోగలరు? చాలా కొద్దిమంది మాత్రమే చేరుకోగలరు. అయినా ఇదే జీవిత పరమోత్కృష్ట లక్షణం. వీరుని లక్షణం నుంచే దీనిని చేరుకోవాలి. పిరికివారు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు. దైవానికి అంకితం కాలేరు. అర్జునునికున్న యుద్ధంలాగానే, మనందరికున్న ఈ జీవితసమరంలో బుద్ధి, బలం రెండూ చాలా అవసరం. కొంచెం తమాయించుకొని అర్జునుడు రాబోయే శ్లోకాల్లో శ్రీకృష్ణునితో తన పరిస్థితిని వివరించబోతున్నాడు.
వేదాంతంలో పిరికితనానికి స్థానం లేదు. ‘అభీః, అభీః’ అంటే నిర్భయత్వం. బ్రహ్మ అభయం అంటే నిర్భయంగా ఉండడమే భగవంతుని లక్షణం. నీవు భగవంతుని పొందినప్పుడు నిర్భయుడవు కాగలవు. ‘అభయం వైప్రాప్తోసి జనకా’ జనకా! నీవు నిర్భయుడవు అయ్యావు అని, యాజ్ఞవల్క్యుడు జనకునితో బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పాడు. అది ఆధ్యాత్మిక అభ్యున్నతి. పిరికివారు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపలేరు. నిర్భయత్వంతోనే ఆధ్యాత్మిక జీవితం సాధ్యపడుతుంది. జంతువులు కేవలం ప్రాణులు మాత్రమే. తన నిజస్థితిని తెలుసుకున్నాక మానవుడు నిర్భయంగా ఉండగలడు. ఉపనిషత్తులన్నీ కూడా ప్రతిపుటలోనూ నిర్భయత్వాన్నే బోధిస్తున్నాయని స్వామి వివేకానంద చెప్పారు.
మరి, ‘మనకేమీ బలహీనతలు ఉండవా?’ అని అడిగితే, ఉంటాయి. మానవ బలహీనతలుంటాయి. బలహీనతలు బలహీనతలవల్ల సమసిపోవు. బలహీనతలు బలం వల్ల సమసిపోతాయి. మురికి నీరు మురికిని శుభ్రం చెయ్యలేదు. శుభ్రమైన నీరే మురికిని శుభ్రం చేస్తుంది. ఈ ప్రాపంచిక బలహీనతలకు, బలం ఒక్కటే పరిష్కారమన్నది వేదాంతబోధ. మనం ఆధ్యాత్మిక జీవితం గడిపితే మనలో పవిత్రత పెరిగి, బలం చేకూరుతుంది. దయాగుణం పెంపొందుతుంది. మనిషిలో దయ, నిర్భయత్వం కలిసి ఉండాలి. అన్ని భారతీయ గ్రంథాల్లోనూ నిర్బయత్వం, దయాగుణం సంగమించి ఉంటాయి. ఏదో ఒక గుణం ఎక్కువగా ఉండడం గమనిస్తాం కానీ, నిర్భయం – దయ మనిషిలో సమపాళ్ళలో ఉండటం చాలా అరుదుగా చూస్తాం. దీనినే శ్రీకృష్ణుడు 12వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. మానవుడు, అతని అభ్యున్నతి, వికాసం, పరిపూర్ణత్వం గీతలోని 18 అధ్యాయాలలో శ్రీకృష్ణుడు చక్కగా వివరిస్తాడు. మనిషి సమస్యలను పరిష్కరించడమే గీత ధ్యేయం కానీ అది యుద్ధానికి సంబంధించిన గ్రంథం కాదు. గీత మానవుని గుణాలను వృద్ధిచేసి, పరిపూర్ణునిగా చేసే గ్రంథం. మానవుని గుణంలో ఈ రెండు, అంటే అధిక బలం, అమిత దయ మేళవించి ఉండాలి. అదే విధంగా విశాలమైన భావాలు, గొప్ప నమ్మకం, ధ్యేయం కలిగి ఉండాలి. తాము అన్ని రకాల భావాలను తమలో సమన్వయపరచుకోగలమని చాలామంది చెబుతుంటారు. కానీ వారిలోపలికి తొంగిచూస్తే ఏ విధమైన గంభీర లక్షణం కనిపించదు. వారు ఏ ఒక్క ధ్యేయాన్ని స్థిరంగా ఉంచుకోక పోవడంవల్ల అన్ని రకాల భావాలకు స్పందిస్తూ ఉంటారు. అదేమంత గొప్ప లక్షణం కాదు.
కొంతమంది నిశితబుద్ధి కలిగి ఉండి కూడా ఎంతవరకూ వారి సిద్ధాంతమే సరియైందన్న మత దురభిమానులుగా ఉంటారు. వేదాంతం గంభీరంగాను, విశాలంగాను ఉండమంటుందని స్వామి వివేకానంద అంటారు. విశాల హృదయం, నిశితబుద్ధి ఉన్నప్పుడే ఉన్నత విలువలున్న వ్యక్తివి కాగలవు. మనం సముద్రమంత గంభీరంగాను, ఆకాశమంత విశాలంగాను ఉండాలి. వేదాంతం ప్రపంచమంతా కూడా ఇటువంటి గొప్ప శీలసంపన్నులను చూడాలనుకుంటుంది. కాబట్టి వేదాంతం ఉత్తమ గుణాన్ని, సౌశీల్యాన్ని పెంపొందించి మనిషిని పరిపూర్ణునునిగా చేస్తుంది. బలహీనమైన మనస్సు నుంచి ఇలాంటి సౌశీల్యం పెంపొందదు. స్థిరమైన అవగాహనతో, శక్తిమంతంగా ఉన్న మనస్సు మాత్రమే పరిపూర్ణతను ప్రసాదించగలదు.
పై రెండు శ్లోకాలు విన్న అర్జునుడు మెల్లగా ఆలోచించుకొని, బుద్ధిని కొంత సమన్వయపరచుకొని ఇక్కడి నుండి కొంచెం పొందికయిన రీతిలో మాట్లాడబోతున్నాడు. శ్రీకృష్ణుని విశదీకరణ అతనికి టానిక్‌లాగా పనిచేసింది. ‘ఉత్తిష్ఠ’ లేచి నిలబడు అని శ్రీకృష్ణుడు అన్నాడు. కఠోపనిషత్తులో కూడా ‘ఉత్తిష్ఠత, జాగ్రత, ప్రాప్యవరాన్ నిబోధత’ అని, లేచి నిలబడి, మేలుకొని, నీ లక్ష్యాన్ని చేరుకో అని చెప్పబడింది. జీవితంలో నిరంతరం ఆశావహ దృక్పథంతో ముందుకు అడుగువేయమని మనకు ఉపనిషత్తు బోధిస్తున్నది.
ప్రవహిస్తున్న నీరు పరిశుద్ధంగా, శుభ్రంగా ఉంటుంది. అదే ఒకేచోట నిలచిపోయిన నీరు దుర్వాసన కొడుతుంది. అలాగే ఎదుగుదల లేని జీవితం నిస్సారం. సృజనాత్మకతను కోల్పోయిన మనస్సు వికాసాన్ని కోల్పోతుంది. మనస్సు పరిశుభ్రంగా ఉన్నట్లయితే అద్భుతమైన సృజనాత్మక శక్తి పెంపొందుతుంది. ఈ టానిక్‌ను తాగిన అర్జునుని మనస్సు ప్రశాంతంగా, నిశ్చలంగా మారి కొంచెం పొందికైన విధంగా మాట్లాడుతున్నాడు. తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలుగుతున్నాడు. జంతువులు భావాలను అదుపులో పెట్టుకోలేవు. ఒక్క మానవునికే ఈ శక్తి ఉంది. ఇదే బుద్ధి వికాసానికి ప్రారంభదశ. జంతువు మనోజనిత ఉద్వేగాలను వెంటనే వ్యక్తం చేసేస్తుంది. కానీ మనిషికి పరిస్థితులను అంచనా వేస్తూ, తన ఆలోచనలను, ఉద్వేగాలను నియంత్రించుకునే శక్తి ఉంది. పవిత్రమైన ఆలోచనా విధానానికి, భావాలను అదుపులో పెట్టుకోవడం ప్రధానం. భావాలు అదుపులో పెట్టుకోవడం వలన, చూసిన ప్రతిదానిని కోరుకోకుండా పూర్వాపరాలు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. ఈ గొప్ప గుణం వల్లనే మానవుడు ప్రకృతిని జయించ గలుగుతున్నాడు. న్యూరాలజిస్టు గ్రేవాల్టర్ ఒక్క క్షణం కూడా చింపాంజీకి తన భావాన్ని అదుపులో పెట్టుకోగలిగిన గుణం ఉండదు అంటారు. అర్జునుడు కొద్దిగా మనస్సును సమన్వయ పరచుకున్నాడు.
ఈ అధ్యాయం మధ్యలో శ్రీ కృష్ణుడు మానవునికి సమత్వబుద్ధి అవసరమని చెప్తాడు. ఉద్రేకాలు, భావాలనేవి సమతూకంలో లేకుంటే మనస్సు గాలి దుమారంలా ఉంటుంది. గాలి దుమారం వచ్చినప్పుడు అంతా దుమ్ముతోనే కప్పబడి అంధకారం అలముకుంటుంది. అదేవిధంగా మనిషి బుద్ధి కూడా భావోద్వేగాలను నియంత్రించుకోకపోతే అజ్ఞానాంధకారంలో కూరుకుంటుంది. అటువంటి క్లిష్టపరిస్థితిలో ఏమి ఆలోచించినా, మాట్లాడినా అర్థవంతంగా ఉండదు. కాబట్టి, ఏమీ వ్యక్తం చెయ్యకుండా ఉండడమే మంచిది. అంతా సర్దుకున్నాక, పవిత్రమైన ఆలోచనలతో సమర్థవంతమైన కార్యాన్ని చెయ్యగలుగుతాము. శ్రీరామకృష్ణుల శిష్యుడు ఒకరు ‘మీరు ఉద్వేగంతో, ఆవేశంలో ఒక ఉత్తరం వ్రాసినట్లయితే ‘నేను చాలా గొప్పగా వాడికి బుద్ధి వచ్చేలా ఉత్తరం వ్రాశామని అనుకుంటారు. కానీ అదే ఉత్తరాన్ని పోస్టుచెయ్యకుండా మీ దిండుక్రింద రెండు రోజులు ఉంచాక పోస్టు చెయ్యండి’, అని చెప్పేవారు. రెండురోజులయ్యాక, ఆ ఉత్తరాన్ని మీరు పోస్టు చెయ్యరు. బాధలో ఉన్నప్పుడు వ్రాసిన ఉత్తరాన్ని వెంటనే టపాలో వేయకుండా, రెండు రోజులు ఆగినట్లైతే మనలో ఆలోచన పెరిగి, అలాంటి సమాధానంతో మరిన్ని సమస్యలు ఎందుకు తెచ్చుకోవడమని ఆ పనిని విరమించుకుంటాము. ఈ లక్షణం మనిషికే ఉంది. కానీ జంతువుకు ఉండదు. ఈ విధంగా మనం మనస్సుకు శిక్షణ నిచ్చుకోకపోతే మన నడవడికకు, జంతువు ప్రవర్తించే తీరుకు తేడా ఏమీ ఉండదు. కాబట్టి మనిషి ఆలోచన జంతువుకు ఉండదు. ఏదైనా స్ఫురించిన వెంటనే కార్యం లోనికి దూకితే అది అర్థవంతమైన పని అవదు.
(Source: శ్రీమద్భగవద్గీతా సందేశం by Swami Ranganathananda)