ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు ।
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ॥ 39
ఏషా, తే, అభిహితా, సాంఖ్యే, బుద్ధిః, యోగే, తు, ఇమామ్, శృణు,
బుద్ధ్యా, యుక్తః, యయా, పార్థ, కర్మబంధమ్, ప్రహాస్యసి.
పార్థ = అర్జునా; సాంఖ్యే = ఆత్మతత్త్వ విషయంలో; ఏషా = ఈ; బుద్ధిః = జ్ఞానం; తే = నీకు; అభిహితా = చెప్పబడినది; తు = కాని; యయా = ఏ; బుద్ధ్యా = జ్ఞానంతో; యుక్తః = కూడుకొన్నవాడవై; కర్మబంధమ్ = కర్మ బంధాన్ని; ప్రహాస్యసి = త్యజిస్తావో; (అట్టి) యోగే = కర్మ యోగవిషయంలో; ఇమామ్ = ఈ చెప్పబోవు దానిని; శృణు = విను.
తా ॥ (జ్ఞానయోగోపదేశం ఉపసంహరింపబడి, తత్సాధనమైన కర్మయోగం ప్రస్తావింపబడుతోంది) పార్థా! నీకు సాంఖ్యమనే ఆత్మతత్త్వం ఉపదేశించబడింది. (11–30 శ్లోకాలు) (నీకు ఆత్మతత్త్వాన్ని గూర్చి ‘అపరోక్ష జ్ఞానం’ కలుగకపోతే, చిత్తశుద్ధి ద్వారా దానిని పొందడానికి) ఇక కర్మయోగాన్ని చెబుతున్నాను, విను. నిష్కామకర్మ యోగ విషయమైన ఈ జ్ఞానం లభిస్తే నీవు కర్మబంధనం నుండి విముక్తుడవవుతావు.