నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ॥ 23
న, ఏనమ్, ఛిందంతి, శస్త్రాణి, న, ఏనమ్, దహతి, పావకః,
న, చ, ఏనమ్, క్లేదయంతి, ఆపః, న, శోషయతి, మారుతః.
ఏనమ్ = ఈ ఆత్మను; శస్త్రాణి = శస్త్రాలు; న ఛిందంతి = ఛేదించ లేవు; పావకః = అగ్ని; ఏనం = దీనిని; న దహతి = దహించ లేదు; ఏనమ్ = దీనిని; ఆపః చ = నీళ్ళు; న క్లేదయంతి = తడుప లేవు; మారుతః = వాయువు; న శోషయతి = ఎండింపజాలదు.
తా ॥ (ఆత్మ అవినాశి అని దృఢపరచడానికి ఆత్మ హనన సాధన భావం ప్రదర్శించ బడుతోంది 🙂 ఎటువంటి శస్త్రమైనా ఈ ఆత్మను ఛేదించ లేదు, అగ్ని దహించ లేదు, నీరు తడుప లేదు, గాలి ఎండింపజాలదు.
వాఖ్య:-
జీవుడికి (1) శరీరం (2) మనస్సు (3) ఆత్మ అనే మూడు ఉంటాయి. వీటిలో ఒకదాని కంటే మరొకటి చాలా సూక్ష్మంగా ఉంటాయి.
పంచభూతాలు (అంటే ఆయుధాలు, నీళ్లు, నిప్పు వంటివి) కేవలం కంటికి కనిపించే స్థూల శరీరాన్ని మాత్రమే బాధించగలవు (గాయపరచగలవు), కానీ సూక్ష్మంగా ఉండే మనస్సును తాకలేవు. అలాంటప్పుడు, వాటన్నిటికంటే అత్యంత సూక్ష్మమైన ఆత్మను అవి ఎలా బాధించగలవు? (అసలు ఏమీ చేయలేవు).
నిజానికి లోతుగా (పరమార్థ దృష్టితో) ఆలోచిస్తే… ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం (మనస్సు) రెండూ కూడా… తాడును చూసి పాము అనుకున్నట్టుగా, ఆత్మ మీద కల్పించుకున్న భ్రమలే.
మనం భ్రమపడి ఊహించుకున్న వస్తువు, నిజమైన వస్తువును ఏమీ చేయలేదు కదా! ఉదాహరణకు ఎండమావిలో కనిపించే నీళ్లు, అక్కడున్న నేలను తడపలేవు కదా!
ఆత్మకు ఉన్న ఇటువంటి గొప్ప స్వభావం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే, మనిషికి అంతులేని ధైర్యం వస్తుంది.