న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః ।
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥ 20
న, జాయతే, మ్రియతే, వా, కదాచిత్, న, అయమ్, భూత్వా, అభవితా, వా, న, భూయః,
అజః, నిత్యః, శాశ్వతః, అయమ్, పురాణః, న, హన్యతే, హన్యమానే, శరీరే.
అయమ్ = ఈ ఆత్మ; కదాచిత్ = ఒకప్పుడు; న జాయతే = జన్మించడం లేదు; న వా మ్రియతే = మరణించడం లేదు; భూత్వా = ఒకప్పుడుండి; భూయః = మళ్ళీ; అభవితా = ఉండనిది; న = కాదు; (కనుక ఆత్మకు మృత్యువు లేదు) న భూత్వా = ఒకప్పుడుండక; భూయః = మరల; భవితా వా = కలుగునది; న = కాదు; (కనుక ఆత్మకు జన్మ లేదు) అయమ్ = ఈ ఆత్మ; అజః = జన్మరహితమైనది; శరీరే = దేహం; హన్యమానే = హతమౌతున్నా; న హన్యతే = చంపబడదు; నిత్య = మృత్యువు లేనిది; శాశ్వతః = నాశం లేనిది; పురాణః = వృద్ధి లేనిది.
తా ॥ ఈ ఆత్మకు జన్మ లేదు, మరణం లేదు. ఏలనన, పూర్వం ఉండకుండా తరువాత ఉండడమే జన్మ; పూర్వం ఉండి తరువాత ఉండకపోవడమే మృత్యువు. ఆత్మకు ఈ రెండూ లేవు. అంటే, ఆత్మకు జనన మరణాలు లేవు. శరీరం నశించినప్పటికీ ఈ ఆత్మ వినష్టం కాదు.