మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ।
ఆగమాపాయినోఽనిత్యాః తాంస్తితిక్షస్వ భారత ॥ 14
మాత్రా స్పర్శాః, తు, కౌంతేయ, శీతోష్ణ సుఖదుఃఖదాః,
ఆగమాపాయినః, అనిత్యాః, తాన్, తితిక్షస్వ, భారత.
కౌంతేయ = అర్జునా; మాత్రాస్పర్శాః తు = ఇంద్రియాలు, తద్విషయాలు; శీత ఉష్ణ సుఖ దుఃఖదాః = శీతోష్ణాలను, సుఖదుఃఖాలను కలిగించేవి; ఆగమాపాయినః = ఉత్పత్తివినాశశీలములు; అనిత్యాః = అనిత్యమైనవి; భారత = అర్జునా; తాన్ = ఈ మాత్రాస్పర్శలను; తితిక్షస్వ = సహించు.
తా ॥ (‘నేను దుఃఖీస్తోంది వారి కోసం కాదు. వారి వియోగంతో నాకే దుఃఖం కలుగుతుందని భయపడుతున్నాను’ అని అంటావా:) ఓ కౌంతేయా! విషయేంద్రియ సంయోగం వల్లనే శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, అనుభూతమౌతు న్నాయి. (అదేవిధంగా, ప్రియజన సంయోగ వియోగాలు కూడా సుఖదుఃఖాలను కలిగిస్తున్నాయి.) కాని, ఇవన్నీ అనిత్యమైనవి, ఉత్పత్తి వినాశ శీలములై ఉన్నాయి. వీటినన్నింటిని (ధీరుడవైన) నీవు సహించు.