సంజయ ఉవాచ :
ఏవముక్త్వాఽర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ ।
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ॥ 47
ఏవమ్, ఉక్త్వా, అర్జునః, సంఖ్యే, రథోపస్థే, ఉపావిశత్,
విసృజ్య, సశరమ్, చాపమ్, శోకసంవిగ్నమానసః.
సంజయః = సంజయుడు; ఉవాచ = పలికెను; అర్జునః = అర్జునుడు; ఏవమ్ ఉక్త్వా = ఇట్లు పలికి; సంఖ్యే = యుద్ధమున; సశరమ్ = బాణంతో ఉన్న; చాపమ్ = వింటిని; విసృజ్య = విడిచి; శోకసంవిగ్నమానసః = దుఃఖ విదీర్ణ చిత్తుడై; రథోపస్థే = రథ మధ్యంలో; ఉపావిశత్ = కూలబడ్డాడు.
తా ॥ సంజయుడు పలికెను: అర్జునుడు ఇలా పలికి, ఎక్కుపెట్టిన విల్లును వీడి, శోకతప్తచిత్తుడై రథమధ్యంలో కూలబడ్డాడు.
వ్యాఖ్య:-
“శోకసంవిగ్నమానసః” (దుఃఖంతో కలవరపడిన మనస్సు):
అర్జునుడు శోకంతో మనసు కలవరపడి, ధనుర్బాణాలు కూడా చేతిలోంచి వదిలేశాడు. అర్జునుడి జీవితంలో ఇంతవరకు నిరుత్సాహంతో ధనస్సు వదిలిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కాబట్టి దీనికి ఏదో బలమైన కారణం ఉండాలి—అది స్వజనుల క్షయం గురించిన ఆందోళనే.
ఆ ఆందోళన దుఃఖంగా మారింది. ఫలితంగా అతను రాజ్యం, భోగాలను తృణంలా చూశాడు. యుద్ధాన్ని తిరస్కరించాడు. ఈ పరమ వైరాగ్యాన్ని అవకాశంగా పట్టుకుని శ్రీకృష్ణుడు అర్జునుడికి గొప్ప ఆత్మజ్ఞానోపదేశం చేశాడు. అర్జునుడి విషాదం విషాదంగా ఉండకుండా విషాద యోగంగా మారింది.
విషాద యోగం ఎందుకు మేలు?:
అర్జునుడు ప్రపంచ సుఖాలు, రాజ్యభోగాలపై విముఖత కలిగి, ధర్మాన్ని తెలుసుకోవాలని పరితపించాడు (ధర్మసంమూఢచేతాః). ఇలాంటి పరితాపం ముముక్షువులకు అత్యవసరం. దైవం, ధర్మం కోసం వచ్చిన విషాదం యోగానికి దారి తీస్తుంది.
విరక్తి + ఆసక్తి = మోక్ష మార్గం:
ప్రపంచ విషయాల్లో విరక్తి + ధర్మం, దైవంలో ఆసక్తి ఉంటే మాత్రమే జీవుడు త్వరగా మోక్ష పదానికి చేరుకోగలడు. అర్జునుడిలో రెండూ సమకూర్చి ఉన్నాయి కాబట్టి, అతని అర్హతను గుర్తించి శ్రీకృష్ణుడు వెంటనే జ్ఞానోపదేశం చేశాడు.
ఎవరైనా అర్జునుడిలా…:
ప్రపంచ విషయాలపై విరక్తి కలిగి, ధర్మం కోసం తహతహలాడితే—భగవదంగ్రహంతో జ్ఞానోదయం, పరమశాంతి తప్పకుండా లభిస్తాయి.