యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః । 
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ॥ 38
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ । 
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ॥ 39  
యద్యపి, ఏతే, న, పశ్యంతి, లోభ ఉపహత, చేతసః, 
కులక్షయకృతమ్, దోషమ్, మిత్రద్రోహే, చ, పాతకమ్. 
కథమ్, న, జ్ఞేయమ్, అస్మాభిః, పాపాత్, అస్మాత్, నివర్తితుమ్, 
కులక్షయకృతమ్, దోషమ్, ప్రపశ్యద్భిః; జనార్దన.
ఏతే = ఈ దుర్యోధనాదులు; లోభ ఉపహత = లోభదూషిక; చేతసః = చిత్తులై; కులక్షయకృతమ్ = వంశనాశనం వల్ల కలిగే; దోషమ్ = దోషాన్ని; మిత్రద్రోహే = మిత్రద్రోహ కారణంగా; పాతకమ్ చ = పాపాన్ని కూడా; యద్యపి న పశ్యంతి =గుర్తించలేక పోయినా; జనార్దన = కృష్ణా; కులక్షయకృతమ్ =వంశనాశనం వల్ల కలిగే; దోషమ్ = దోషాన్ని; ప్రపశ్యద్భిః = బాగా చూస్తున్న; అస్మాభిః = మనచేత; అస్మాత్ = ఈ; పాపాత్ = పాపం నుండి; నివర్తితుమ్ = నివర్తిల్లడానికి; కథం = ఎలా; నజ్ఞేయమ్ = తెలియదగినది కాదు?
తా ॥ (బంధువధ వల్లకలిగే పాపాన్ని లెక్కచేయకుండా వీరు యుద్ధ ప్రవృత్తులైనట్లు, నీవు కూడా యుద్ధం చేసి రాజ్యాన్ని భోగింపకూడదా? అని అంటావా -) వీరు రాజ్యలోభం కారణంగా వివేకాన్ని త్యజించి, కులక్షయం వల్ల కలిగే దోషాన్ని, మిత్రదోహం వల్ల కలిగే పాపాన్ని గ్రహించలేకున్నారు. జనార్దనా! వంశనాశం వల్ల కలిగే దోషాన్ని గుర్తిస్తున్న మనం ఈ పాపం నుండి నివర్తిల్లడానికి తెలియని వారం ఎలా కాగలుగుతాం ?