తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ॥ 27
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ ।
తాన్, సమీక్ష్య, సః, కౌంతేయః, సర్వాన్, బంధూన్, అవస్థితాన్
కృపయా, పరయా, ఆవిష్టః, విషీదన్, ఇదమ్, అబ్రవీత్
సః = ఆ; కౌంతేయః = అర్జునుడు; అవస్థితాన్ = ఉండిన; తాన్ = ఆయా; బంధూన్ సర్వాన్ = బంధువులనందరిని; సమీక్ష్య = చూసి; పరయా = మిక్కిలి; కృపయా = దయతో; ఆవిష్టః = ఆవేశింపబడి; విషీదన్ = దుఃఖీస్తూ; ఇదమ్ = ఈ విధంగా; అబ్రవీత్ = పలికెను.
తా ॥ అర్జునుడు అచటనున్న బంధువుల నందరిని గాంచి, అత్యంత దయార్ద్రచిత్తుడై దుఃఖీస్తూ ఈ విధంగా పలికాడు.
వ్యాఖ్య:-
“కృప” (దయ) యొక్క లోపం: ‘కృప’ అంటే దయ, కరుణ, కనికరం, జాలి. ఇది గొప్ప సుగుణం. కానీ సరైన చోట చూపితేనే శోభిల్లుతుంది. అధర్మం చేసిన కౌరవులపై అర్జునుడు దయగలవాడు. కానీ “వీళ్ళందరూ నా బంధువులు” అనే మమత్వ బుద్ధి వచ్చి అతన్ని కలుషితం చేసింది. “వీళ్ళెలా చంపను?” అనే దిగులు వచ్చింది. క్షత్రియుడైన అర్జునుడికి యుద్ధ సమయంలో ఈ సుగుణం సరిపోలేదు. ఎందుకంటే, దయ చూపరాని వారిపై చూపడం, చూపకూడని సమయంలో చూపడం ప్రారంభించాడు. ఈ లోపాన్నే గీతా తత్త్వంతో శ్రీకృష్ణుడు అర్జునుడి హృదయం నుండి తొలగించాడు .
“విషీదన్” (దుఃఖించుట): ‘దుఃఖించుచు’ అని చెప్పడం వల్ల—ఎంత శారీరక బలం, భౌతిక శక్తి ఉన్నా, అవిద్య (అజ్ఞానం) తొలగనంత కాలం మనుష్యుడు ఒక్క క్షణంలో క్రుంగిపోతాడని స్పష్టమవుతోంది. అర్జునుడు మహా శక్తివంతుడు, దివ్యాస్త్రాలు కలవాడు. కానీ అజ్ఞానం వచ్చినప్పుడు బాలుడిలా బలహీనుడై దుఃఖపడటం మొదలెట్టాడు. మనసు వ్యాధి ఉంటే శరీరం ఎంత బలంగా ఉన్నా చింత వదలదు. కాబట్టి ఆత్మజ్ఞానంతో అవిద్య పూర్తిగా తొలగితే మాత్రమే జీవుడికి నిరంతర ఆనందం, దుఃఖరహితం సాధ్యమవుతుంది.
అర్జునుడు కూడా అవిద్యతో దుర్బలమయ్యాడు. అయితే సామాన్యుల విషయం మరి ఏం చెప్పాలి? కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంతో మనసు జయించడం, దాని ద్వారా మనశ్శాంతి పొందడం ప్రతి జీవికి ప్రధాన బాధ్యత. అర్జునుడి ఈ దీనస్థితిని చూసి శ్రీకృష్ణుడు ఆత్మవిద్యను బోధించాడు .