పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ॥ 15
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ॥ 16
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ॥ 17
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ॥ 18
పాంచజన్యమ్, హృషీకేశః, దేవదత్తమ్, ధనంజయః,
పౌండ్రమ్, దధ్మౌ, మహాశంఖమ్, భీమకర్మా, వృకోదరః.
అనంతవిజయమ్, రాజా, కుంతీపుత్రః, యుధిష్ఠిరః,
నకులః, సహదేవః, చ, సుఘోష మణిపుష్పకౌ.
కాశ్యః, చ, పరమేష్వాసః, శిఖండీ, చ, మహారథః,
ధృష్టద్యుమ్నః, విరాటః, చ, సాత్యకిః, చ, అపరాజితః.
ద్రుపదః, ద్రౌపదేయాః, చ, సర్వశః, పృథివీపతే,
సౌభద్రః, చ, మహాబాహుః, శంఖాన్, దధ్ముః, పృథక్, పృథక్.
హృషీకేశః = శ్రీకృష్ణుడు; పాంచజన్యమ్ = పాంచజన్యం అనే శంఖాన్ని; దధ్మౌ = పూరించాడు; ధనంజయః = అర్జునుడు; దేవదత్తమ్ = దేవదత్తం అనే శంఖాన్ని; దధ్మౌ = పూరించాడు; భీమకర్మా = భయాన్ని కలిగించే పనులు చేసే; వృకోదరః = భీముడు; మహాశంఖం పౌండ్రం = పౌండ్రం అనే గొప్ప శంఖాన్ని; దధ్మౌ = పూరించాడు. కుంతీపుత్రః = కుంతీపుత్రుడైన; రాజా యుధిష్ఠిరః = ధర్మరాజు; అనంత విజయమ్ = అనంత విజయమనే శంఖమును; నకులః = నకులుడు; సహదేవః చ = సహదేవుడు; సుఘోషమణిపుష్పకౌ = సుఘోష, మణి పుష్పకములనే శంఖాలను, (పూరించారు). పృథివీ పతే = ధృతరాష్ట్ర భూపతీ; పరమ ఇష్వాసః = మహా ధనుర్ధరుడగు; కాశ్యః చ = కాశీరాజూ; మహారథః = మహారథుడైన శిఖండీ చ = శిఖండీ ధృష్టద్యుమ్నః చ = ధృష్టద్యుమ్నుడూ; విరాటః చ = విరాటరాజూ; అపరాజితః = అజేయుడైన; సాత్యకిః చ = సాత్యకీ; ద్రుపదః = ద్రుపదుడు, ద్రౌపదేయాః = ద్రౌపదీ పుత్రులు; మహాబాహుః = మహాభుజుడైన; సౌభద్రః చ = అభిమన్యుడూ; సర్వశః = నలువైపుల నుండి; పృథక్ పృథక్ = వేఱు వేఱుగా; శంఖాన్ = శంఖాలను; దధ్ముః = పూరించారు.
తా ॥ హృషీకేశుడు పాంచజన్యం అనే శంఖాన్ని, ధనంజయుడు దేవదత్తమనే శంఖాన్ని, ఎంతటి భయంకర కర్మలనైనా చేయగల భీముడు పౌండ్రమనే శంఖాన్ని పూరించారు.
తా ॥ (ఆ శంఖాల వివరాలు) కుంతీతనయుడైన ధర్మరాజు అనంతవిజయమనే శంఖాన్ని, నకుల-సహదేవులు సుఘోష-మణిపుష్పకాలనే శంఖాలను పూరించారు.
తా ॥ ఓ ధృతరాష్ట్ర భూపతీ! మహాధనుర్ధరుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదరాజు, ద్రౌపదీ తనయ పంచకము, మహాభుజుడైన అభిమన్యుడు మొదలైనవారు నలువైపుల నుండి తమతమ శంఖాలను విడివిడిగా పూరించారు.
వ్యాఖ్య:-
దివ్య శంఖాలు: కృష్ణుడు, అర్జునుడు మొదలైన వారు పూరించిన పాంచజన్యం వంటి శంఖాలు మామూలువి కావు, అవి ఎంతో శక్తివంతమైన దివ్య శంఖాలు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం.
“పాంచజన్యం” (కృష్ణుడి శంఖం): పంచజనుడు అనే రాక్షసుడి ఎముకలతో తయారైంది కాబట్టి, శ్రీకృష్ణుడి శంఖానికి ‘పాంచజన్యం’ అని పేరు వచ్చింది.
“హృషీకేశుడు” (కృష్ణుడు): ‘హృషీకాలు’ అంటే ఇంద్రియాలు. ‘ఈశుడు’ అంటే అధిపతి (యజమాని). అంటే ఇంద్రియాలన్నింటికీ అధిపతి ఆయనే, అన్నింటినీ గమనించే సాక్షి ఆయనే అని అర్థం. ఆనందానికి నిలయమైన వాడు అని కూడా దీనికి మరో అర్థం ఉంది .
“ధనంజయుడు” (అర్జునుడు): రాజసూయ యాగం కోసం ఎందరో రాజులను గెలిచి ధనాన్ని సంపాదించి తెచ్చాడు కాబట్టి, లేదా, ధనం మీద ఆశను జయించినవాడు కాబట్టి…అర్జునుడికి ‘ధనంజయుడు’ అని పేరు వచ్చింది .
“వృకోదరుడు” (భీముడు): ‘వృకం’ అంటే తోడేలు. తోడేలు పొట్ట లాంటి పొట్ట (ఎంత తిన్నా అరిగించుకునే శక్తి) ఉన్నవాడు కాబట్టి, లేదా, తిన్నదంతా భస్మం చేసే ‘వృకం’ అనే అగ్ని (జాఠరాగ్ని) కడుపులో ఉన్నవాడు కాబట్టి…భీముడికి ‘వృకోదరుడు’ అనే పేరు వచ్చింది .