నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే ।
మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః ॥ 7
నియతస్య, తు, సన్న్యాసః, కర్మణః, న, ఉపపద్యతే,
మోహాత్, తస్య, పరిత్యాగః, తామసః, పరికీర్తితః.
తు = కాని; నియతస్య కర్మణః = విహితకర్మను; సన్న్యాసః = త్యజించడం; న ఉపపద్యతే = యుక్తం కాదు; మోహాత్ = అవివేకంతో; తస్య = దానిని; పరిత్యాగః త్యజించడం; తామసః = తామసమని; పరికీర్తితః = చెప్పబడింది.
తా ॥ (ఇక, త్యాగత్రైవిధ్యం ప్రదర్శించబడుతోంది : కామ్యకర్మలు బంధ కారణాలవడం వల్ల వాటిని సన్న్యసించడం యుక్తమే) కాని, నిత్యకర్మల త్యాగం (అవి చిత్తశుద్ధిని కలిగించి మోక్షాన్ని చేకూర్చేవవడం వల్ల) యుక్తం కాదు. అవివేకం వల్ల (ఉపాదేయాలైన) ఈ కర్మలను త్యజించడం తామసం అని అనబడుతోంది. (ఇది త్రివిధగౌణ–సన్న్యాసాలలో ఒకటి).