తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః ।
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ॥ 77
తత్, చ, సంస్మృత్య, సంస్మృత్య, రూపమ్, అతి, అద్భుతమ్, హరేః,
విస్మయః, మే, మహాన్, రాజన్, హృష్యామి, చ, పునః, పునః.
రాజన్ = రాజా; హరేః = శ్రీ కృష్ణుని; తత్ = ఆ; అత్యద్భుతమ్ = అతి అద్భుతమైన; రూపమ్ = విశ్వరూపాన్ని; సంస్మృత్య సంస్మృత్య చ = మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ కూడా; మే = నాకు; మహాన్ విస్మయః = అత్యంతాశ్చర్యం (కలుగుతోంది); పునః పునః చ = మళ్ళీ మళ్ళీ; హృష్యామి =సంతోషిస్తున్నాను.
తా ॥ రాజా! అద్భుతమైన శ్రీకృష్ణదేవుని విశ్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ, నేను పరమవిస్మయాన్ని పొందుతున్నాను; ఎనలేని ఆనందం కలుగుతోంది.
వ్యాఖ్య:-
కిందటి శ్లోకం భగవంతుని బోధ వల్ల కలిగిన ఆనందాన్ని చెప్పింది. ఈ శ్లోకం భగవంతుని విశ్వరూపాన్ని తలంచుకున్నప్పుడు, భావించినప్పుడు కలిగే దివ్య అనుభూతి, పరమానందాన్ని వ్యక్తం చేస్తోంది.
‘హృష్యామి చ పునః పునః’ — సంజయుడు భగవంతుని బోధనను, ఆయన రూపాన్ని గుర్తుచేసుకుని ఆనందం పట్టలేకున్నాడు. అతనికి కలిగిన ఆశ్చర్యం, ఆనందం అంతులేనివి. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాన ప్రాప్తి ద్వారా ఈ ‘అతి హర్ష’ దశను పొందాలి. నశ్వరమైన ప్రపంచ భావనను వదిలి, శాశ్వతమైన భగవత్ స్వరూపాన్ని చింతించినప్పుడు కొందరు ఆనందంతో చిందులు ద్రవిస్తారు. కొందరు ఎదలు ఎత్తి గానం పాడతారు (సామగానం లాగా). కొందరు ఆనందావేశంతో నృత్యం చేస్తారు. ఇవన్నీ అతి హర్షానికి చిహ్నాలు. సంజయుడికి గీతా శ్రవణం, విశ్వరూప దర్శనం తర్వాత తన్మయతతో అలాంటి మహా ఆనందం కలిగింది. ఆ విషయాన్నే ఈ రెండు శ్లోకాల ద్వారా ధృతరాష్ట్రుడికి చెప్పాడు.