శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః ।
సోఽపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ॥ 71
శ్రద్ధావాన్, అనసూయః, చ, శృణుయాత్, అపి, యః, నరః,
సః, అపి, ముక్తః, శుభాన్, లోకాన్, ప్రాప్నుయాత్, పుణ్యకర్మణామ్.
శ్రద్ధావాన్ = శ్రద్ధాయుక్తుడూ; అనసూయః చ = అసూయా రహితుడూ; యః = ఏ; నరః = మనుష్యుడు; శృణుయాత్ అపి = అర్థజ్ఞానం లేకపోయినా కేవలం వింటాడో; సః అపి = అతను కూడా; ముక్తః = ముక్తుడై; పుణ్య కర్మణామ్ = (అగ్నిహోత్రాది) పుణ్యకర్మలు ఒనర్చేవారి; శుభాన్ లోకాన్ = పుణ్యలోకాలను; ప్రాప్నుయాత్ = పొందుతాడు.
తా ॥ (తాను స్వయంగా పఠించలేకపోయినా, ఇతరులు పఠించే దానిని అర్థం తెలియకపోయినా, ఎందుకు ఇంత బిగ్గరగా కష్టపడి ఆపకుండా చదువుచున్నాడు అని-) విద్వేషించకుండా శ్రద్ధాన్వితుడై గీతను వినేవాడు కూడా, (అశ్వమేధాది) పుణ్యకర్మలు ఒనర్చేవారికి ప్రాప్యములైన శుభలోకాలను (స్వర్గాన్ని) పొందుతాడు.