సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ।
ఇష్టోఽసి మే దృఢమితి* తతో వక్ష్యామి తే హితమ్ ॥ 64
సర్వగుహ్యతమమ్, భూయః, శృణు, మే, పరమమ్, వచః,
ఇష్టః, అసి, మే, దృఢమ్, ఇతి, తతః, వక్ష్యామి, తే, హితమ్.
సర్వ గుహ్యతమమ్ = పరమరహస్యమైన; మే = నా; పరమమ్ = శ్రేష్ఠమైన; వచః = వాక్యాన్ని; భూయః = మళ్ళీ; శృణు = విను; మే = నాకు; దృఢమ్ = నిశ్చయంగా; ఇష్టః = ప్రియతముడవు; అసి = అవుతావు; ఇతి తతః = ఈ కారణం వల్ల; తే = నీకు; హితం = హితాన్ని (పురుషార్థ ప్రాప్తి ఉపాయాన్ని); వక్ష్యామి = చెబుతున్నాను.
తా ॥ (అతిగంభీరమైన గీతాశాస్త్రాన్ని తానే సంగ్రహం చేసి చెబుతున్నాడు.) సర్వ గుహ్యతమమైన నా వాక్యాల్ని విను; నీవు నాకు అత్యంత ప్రీతి పాత్రుడవని, నీకు హితాన్ని (పురుషార్థ–ప్రాప్తి ఉపాయాన్ని, సర్వప్రమాణోపేతమైన దానిని నిశ్చయించి) చెబుతున్నాను.