తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత ।
తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ॥ 62
తమ్, ఏవ, శరణమ్, గచ్ఛ, సర్వభావేన, భారత,
తత్ ప్రసాదాత్, పరామ్, శాంతిమ్, స్థానమ్, ప్రాప్స్యసి, శాశ్వతమ్.
భారత = అర్జునా; సర్వభావేన = సర్వాత్మ భావంతో; తం ఏవ = ఆ ఈశ్వరుణ్ణే; శరణం గచ్ఛ = శరణుపొందు; తత్ ప్రసాదాత్ = ఆయన కృపవల్ల; పరాం శాంతిమ్ = పరమశాంతిని; శాశ్వతం స్థానమ్ = మోక్షాన్ని; ప్రాప్స్యసి = పొందుతావు.
తా ॥ (ఇలా జీవులందరూ పరమేశ్వర పరతంత్రులవడం వల్ల, అహంకారాన్ని పరిత్యజించి-) భారతా! సంసారార్తి నాశనం కొరకు నీవు సర్వాత్మ భావంతో ఈశ్వరుణ్ణే శరణుపొందు; ఆయన కృప వల్ల నీవు పరమశాంతిని (మోక్షాన్ని) పొందగలవు.
వ్యాఖ్య:-
కిందటి శ్లోకంలో జీవులు సంసార చక్రంలో చిక్కుకుని గిరగిరా తిరుగుతున్నారని చెప్పారు. మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలా? జనన మరణాలనే ఈ బాధల నుంచి బయటపడటం ఎలా? ఈ ప్రశ్నలకు ఈ శ్లోకంలో సమాధానం ఉంది. సకల జీవుల హృదయాల్లో ఉన్న ఆ పరమాత్మను (సర్వేశ్వరుని) అన్ని రకాలుగా శరణు కోరడమే బంధాల నుంచి విముక్తికి ఏకైక మార్గం. యంత్రాన్ని ఆపాలంటే, ఆ యంత్రాన్ని నడిపేవాడిని ఆశ్రయించాలి కదా! ఈ సంసారం అనే యంత్రాన్ని తిప్పేది సాక్షాత్ ఈశ్వరుడే అని కిందటి శ్లోకంలోనే చెప్పారు (ఈశ్వరః భ్రామయన్…). కాబట్టి జీవుడు ఆ ఈశ్వరుడినే శరణు వేడాలి. లేకపోతే ‘మాయ’ దారి ఇవ్వదు. మాయ శక్తి ఒక్క దేవుడి శక్తికి తప్ప మరే శక్తికీ లొంగదు. ప్రపంచ శక్తులన్నీ మాయకు లోబడి ఉంటే, ఆ మాయ దేవుడికి (ఈశ్వర శక్తికి) లోబడి ఉంటుంది. కాబట్టి, మాయలో ఉన్న జీవులు ఆ భ్రాంతిని దాటాలన్నా, ఈ సంసార చక్రం నుంచి బయటపడాలన్నా, మాయకు అధిపతి అయిన ఆ పరమాత్మను శరణు పొందాలి. ఈ విషయమే ఇక్కడ చెప్పారు.
‘సర్వభావేన’ — హృదయంలో ఉన్న ఆ పరమాత్మను అన్ని విధాలా, పూర్తి మనసుతో శరణు కోరాలని ఇది స్పష్టం చేస్తోంది. శరీరం, మాట, మనసు (త్రికరణాల)తో పూర్తిగా సేవించాలని అర్థం. సగం మనసుతో, ఏదో మొక్కుబడిగా దేవుణ్ణి ప్రార్థించడం లేదా సేవించడం సరిపోదు. మోక్షం కావాలంటే, మనసును బయట విషయాల మీద పంచకుండా, పూర్తిగా భగవంతుని మీదే లగ్నం చేసి ధ్యానించాలి.
‘తత్ప్రసాదాత్’ — మోక్షానికి భగవంతుని అనుగ్రహం అత్యంత అవసరం. అది లేకుండా ఎన్ని ఇతర ఉపాయాలు చేసినా మాయాబంధం వదలదు. ఆ అనుగ్రహం ఎలా వస్తుందో శ్లోకంలోని మొదటి పాదంలో చెప్పారు: భగవంతుడికి పూర్తిగా శరణాగతి చేయడం ద్వారా, అన్ని విధాలా ఆ పరమాత్మను భక్తితో ఆశ్రయించడం ద్వారా లభిస్తుంది. నిర్మలమైన భక్తితో భగవంతుని శరణు కోరితే, ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం వల్ల జీవుడికి అత్యున్నతమైన శాంతి, శాశ్వతమైన మోక్షం దొరుకుతాయి. ఓహో! ఎంత గొప్ప ఫలితం! కాబట్టి జీవుడి మొదటి కర్తవ్యం ఈశ్వరుడికి శరణాగతుడు కావడమే.
‘పరాం శాన్తిమ్’ — ఆ మోక్షం ఎలాంటిది? పరమ శాంతమైనది, దుఃఖం లేనిది. పూర్తి శాంతి ఎక్కడ ఉంది? బయట కనిపించే ప్రపంచంలో లేదు, ఏ లోకంలోనూ లేదు, చక్రవర్తి పదవిలో గానీ, ఇంద్ర పదవిలో గానీ లేదు. కేవలం ‘చూసేవాని’గా (దృక్స్వరూపంగా) ఉన్న పరమాత్మలోనే ఉంది. కాబట్టి శాంతిని కోరుకునే ప్రతి మనిషి ఆ శాంతికి నిలయమైన భగవంతుని శరణు కోరాలి. అప్పుడు ఆ శాంతి తప్పక దొరుకుతుందని శ్రీకృష్ణుడు ఇక్కడ గట్టిగా హామీ ఇచ్చాడు (స్థానం ప్రాప్స్యసి). అయితే, అంత గొప్ప స్థానాన్ని పొందాలంటే తగిన మూల్యం (ధర) చెల్లించాలి. బయట వస్తువుల మీద కోరికను వదిలిపెట్టి, పూర్తి మనసుతో పరమాత్మను ఆశ్రయించడమే ఆ మూల్యం.
‘శాశ్వతమ్‘ — ఈ పదం ద్వారా దైవస్థానం కాలానికి అతీతమైనదని, దానికి నాశనం లేదని స్పష్టమవుతోంది. ప్రపంచంలో ప్రతి వస్తువు అశాశ్వతమే, కాలానికి లొంగిపోయేదే. కాబట్టి, విలువైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి అందరూ ఆ శాశ్వతమైన దైవ (ఆత్మ) పదవిని పొందడానికే ప్రయత్నించాలి. భగవంతుని మాటల మీద పూర్తి నమ్మకం ఉంచి, భక్తితో నడుచుకోవాలి.