భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః ।
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ॥ 55
భక్త్యా, మామ్, అభిజానాతి, యావాన్, యః, చ, అస్మి, తత్త్వతః,
తతః, మామ్, తత్త్వతః, జ్ఞాత్వా, విశతే, తదనంతరమ్.
(యతి) భక్త్యా = జ్ఞానలక్షణమైన భక్తితో; యావాన్ = ఏ ఏ ఉపాధుల వల్ల భేదవైశిష్ట్యాలను (సవిశేషరూపాలను); యః చ = మరియు, సర్వోపాధిశూన్యం (నిర్విశేషం); అస్మి = నేను అవుతున్నానో (ఆ రూపాలలో); మామ్ = నన్ను; తత్త్వతః = యథార్థంగా; అభిజానాతి = ఆత్మరూపంలో గ్రహిస్తాడు; తతః = ఈ సాక్షాత్కారం వల్ల; మామ్ = నన్ను; తత్త్వతః = యథార్థరూపంలో; జ్ఞాత్వా = తెలుసుకుని; తదనంతరమ్ = వెనువెంటనే; (నాయందు) విశతే = ప్రవేశిస్తాడు (జీవత్కాలంలోనే మత్స్వరూపస్థితిని పొందుతాడు).
తా ॥ ఈ జ్ఞానరూపమైన భక్తిచేత నా సవిశేష నిర్విశేష స్వరూపాల తత్త్వాన్ని గ్రహించి, యతి, అద్వైతచిన్మాత్రుడనైన నన్ను ఆత్మరూపంలో సాక్షాత్కరించు కుంటున్నాడు. ఈ సాక్షాత్కారం చేతనే నా యథార్థస్వరూపాన్ని తెలుసుకుంటాడు; వెనువెంటనే* నా యందు ప్రవేశిస్తాడు.* అంటే, జీవితకాలంలోనే మత్ స్వరూపంలో అవస్థితుడవుతాడు.* (గీత : 13-3 చూ.) – భాష్యోత్కర్షదీపిక.