సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ ।
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ॥ 48
సహజమ్, కర్మ, కౌంతేయ, సదోషమ్, అపి, న, త్యజేత్,
సర్వ ఆరంభాః, హి, దోషేణ, ధూమేన, అగ్నిః, ఇవ, ఆవృతాః.
కౌంతేయ = అర్జునా; సదోషమ్ అపి = దోషయుక్తమైనా; సహజమ్ కర్మ = స్వధర్మనిర్ధిష్టమైన కర్మ; న త్యజేత్ = త్యజించకూడదు; హి = ఏమన; సర్వ ఆరంభాః = కర్మలన్ని; అగ్నిః = నిప్పు; ధూమేన ఇవ = పొగచేత కప్పబడునట్లు; దోషేణ = దోషం చేత; ఆవృతాః = ఆవరింపబడి ఉన్నాయి.
తా ॥ కుంతీపుత్రా! దోషయుక్తమైనప్పటికీ, స్వధర్మాన్ని త్యజించడం ఉచితం కాదు; అగ్ని ధూమంచేత ఆవృతమై ఉండేవిధంగా కర్మలన్నీ కూడా ఏదో ఒక దోషంతో కూడి ఉన్నాయి. [పొగను విడిచి అగ్నిని తమఃశీతాది నివృత్తి కొరకు ఉపయోగించుకొనే విధంగా, కర్మలో దోషాన్ని చూడకుండా (కర్మను) సేవిస్తే, అందలి గుణాంశం చిత్తశుద్ధిని ఒసగగలదు.]